అప్పుడు బౌద్ధ సన్యాసిని.. ఇప్పుడు ఏకంగా టెక్ కంపెనీకి సీఈఓ!
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆశ కోల్పోకుండా ముందుకు సాగితే ఏ శిఖరాన్నయినా అధిరోహించవచ్చు అనడానికి లిల్లీ చెన్ ప్రయాణం ఒక అద్భుతమైన ఉదాహరణ. టీనేజ్ వయసులోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతమై, చదువును మధ్యలో ఆపేసి బౌద్ధ సన్యాసినిగా మారిన ఆమె.. అనూహ్య రీతిలో అమెరికాలో టెక్ రంగంలో అడుగుపెట్టి ఇవాళ ఒక కంపెనీకి సీఈఓగా ఎదిగారు.
అనారోగ్యంతో సన్యాసినిగా మారి…
అమెరికాకు చెందిన లిల్లీ చెన్ తన 16 ఏటనే ‘గ్రేవ్స్’ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి బారిన పడ్డారు. తగిన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె.. హైస్కూల్ చదువును అర్ధాంతరంగా నిలిపివేసి, చైనాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న బౌద్ధ మఠానికి వెళ్లారు. అక్కడ ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేవడం, ధ్యానం చేయడం, తనకు సరిపడా ఆహారాన్ని స్వయంగా పండించుకోవడం వంటి కఠినమైన జీవనశైలిని అలవర్చుకున్నారు. అలా ఆరు నెలల పాటు ఆ మఠంలో గడిపిన కాలంలో ఎంతోమంది తమ సమస్యలను పంచుకునేవారని, అయితే అక్కడి సన్యాసులు ఎలాంటి పరిష్కారాలు చెప్పకుండా ముందుగా సమస్యలను శ్రద్ధగా వినేవారని లిల్లీ తెలిపారు. ఈ అనుభవమే ఇతరులను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో తనకు నేర్పించిందని ఆమె పేర్కొన్నారు.
సొంతంగా కోడింగ్ నేర్చుకుని టెక్ రంగంలోకి..
ఒకరోజు ఆ మఠంలో ఉన్న సన్యాసి ఒకరు ఆమెను అమెరికాకు తిరిగి వెళ్లి చదువు కొనసాగించాలని సలహా ఇచ్చారు. ఆ మాటలతో వెనక్కి వెళ్లిన ఆమెకు హైస్కూల్ డిప్లొమా లేకపోయినప్పటికీ, అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ACT) ప్రవేశ పరీక్షలో 36కి 36 మార్కులు సాధించి సంచలనం సృష్టించారు. ఈ అసాధారణ అర్హతతో కొలరాడో కాలేజీలో ప్రవేశం సంపాదించారు. ఆ తర్వాత సొంతంగా కోడింగ్ నేర్చుకుని, గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే మెటాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు.
స్నేహితులతో కలిసి సొంత కంపెనీ స్థాపన
కోవిడ్-19 మహమ్మారి సమయంలో చిన్ననాటి స్నేహితులతో కలిసి ‘కాంటీండా’ అనే ఫుడ్కాస్ట్ ప్రాజెక్టును రూపొందించిన ఆమె, ఆ తర్వాత దానిని ‘ఎఫ్ఎస్హెచ్ టెక్నాలజీస్'(FS Tech Logistics) గా మార్చారు. ప్రస్తుతం ఈ సంస్థ ప్రభుత్వ పాఠశాలలు మరియు వివిధ సంస్థల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం జరిగే బిడ్డింగ్‌లో ఇప్పుడీ సంస్థ ప్రముఖ క్లౌడ్ లైటింగ్ దిగ్గజ సంస్థ ‘యాక్సెంచర్’ కి సైతం గట్టి పోటీ ఇస్తోంది. కష్టాలు ఎదురైనప్పుడు జీవితం అక్కడితో ఆగిపోదని, పట్టుదలతో తిరిగి మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని విజయవంతంగా ప్రారంభించవచ్చని లిల్లీ చెన్ నిరూపించి చూపారు.








