Tinderకు షాక్.. డేటింగ్‌కు ప్రభుత్వ యాప్..! నోబెల్ ప్రైజ్ అల్గారిథమ్‌తో మ్యాచ్!!
ఒకప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించేవి.. ఇళ్లు ఇచ్చేవి.. పెళ్లిళ్లకు పథకాలు ప్రకటించేవి. కానీ ఇప్పుడు ఒక దేశం మరో అడుగు ముందుకేసింది. యూత్ ఎవరితో డేటింగ్ చేయాలి? ఎవరితో జోడీ కుదిరే అవకాశం ఉంది? అన్నదానిలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే.
జననాల రేటు రికార్డు స్థాయికి పడిపోవడంతో సింగపూర్ ప్రభుత్వం స్వయంగా ఓ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దాని పేరు FirstDate.అయితే ఇది Tinder, Bumble లాంటి మామూలు డేటింగ్ యాప్ కాదు. ఇక్కడ నచ్చిన ప్రొఫైల్‌ను ఎడమకో, కుడికో స్వైప్ చేయడం కంటే.. మీ గురించి మీరు చెప్పిన సమాచారాన్ని తీసుకుని అల్గారిథమ్ మీకు సరిపోయే వ్యక్తిని వెతికి పెడుతుంది.
ప్రేమలోకి ఎంట్రీ ఇచ్చిన AI కాదు.. Nobel Prize గెలిచిన మ్యాథ్స్!
FirstDateలో ఉపయోగిస్తున్న టెక్నాలజీనే ఈ కథలో అసలైన విషయం. భాగస్వాములను ఎంపిక చేయడానికి Gale-Shapley algorithmను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం వెనుక ఉన్న పరిశోధనకు అమెరికన్ ఆర్థికవేత్త Lloyd Shapley సహా శాస్త్రవేత్తలకు 2012లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
ఈ అల్గారిథమ్‌ను గతంలోనే విద్యార్థులను పాఠశాలల్లో కేటాయించడం, వైద్య విద్యార్థులను ఆసుపత్రుల్లో రెసిడెన్సీ స్థానాలకు మ్యాచింగ్ చేయడం వంటి రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అదే లాజిక్‌ను మనుషుల సంబంధాలకు ఉపయోగించబోతున్నారు. అంటే.. “ఈ వ్యక్తికి ఈ వ్యక్తి సరిపోతాడా?” అనే ప్రశ్నకు డేటా ఆధారంగా సమాధానం చెప్పే ప్రయత్నం.
Gale-Shapley algorithm అంటే ఏమిటి
ఇద్దరి ఇష్టాలను పోల్చి, ఒకరికొకరు సరిపోయే జోడీని కనుగొనే గణిత పద్ధతి. ఉదాహరణకు 10 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు అనుకుందాం. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన వారిని ఒక లిస్ట్‌గా తయారు చేస్తారు. ఆ ఇష్టాలను పోల్చి, ఇద్దరికీ వీలైనంత బాగా సరిపోయే జంటలను ఈ అల్గారిథమ్ ఏర్పాటు చేస్తుంది. అందుకే దీన్ని సింపుల్‌గా “Stable Matching Algorithm” అని కూడా అంటారు.
సాధారణ dating app: “ఇదిగో 500 profiles వీటిలోంచి నువ్వే ఎంచుకో.” అంటుంది.
అంటే Gale-Shapley ఆధారిత matching approach: “నీ preferences, values, lifestyle ఆధారంగా నీకు సరిపోయే match ఎవరో వ్యవస్థ వెతుకుతుంది.” అంటే ఇది “ఎక్కువ options ఇవ్వడం” కంటే “సరైన matching చేయడం” మీద దృష్టి పెడుతుంది.
డేటింగ్ యాప్‌లో: “వందల మందిని చూపించడం కాదు.. నీకు సరిపోయే వ్యక్తిని లెక్కల ద్వారా వెతకడం.”
Tinderలా వందల ప్రొఫైల్స్ కాదు.. ఒక్కసారి ఒకే వ్యక్తి!
FirstDateలో మిగతా డేటింగ్ యాప్ ల లాంటిది కాని మరో ఆసక్తికరమైన మార్పు ఉంది. సాధారణ డేటింగ్ యాప్స్‌లోకి వెళ్తే.. వందల, వేల ప్రొఫైల్స్ కనిపిస్తాయి. ఒకదాని తర్వాత మరొకటి చూస్తూ.. నచ్చిన వారిని ఎంచుకుంటూ పోవచ్చు. అయితే FirstDate ఆ విధానాన్ని పూర్తిగా మార్చింది. ఇక్కడ ఒక మ్యాచింగ్ సైకిల్లో ఒక్క సరిపడే భాగస్వామిని మాత్రమే సూచిస్తారు.
యూజర్లు తమ ఆసక్తులు, జీవనశైలి, అలవాట్లు, విలువలు వంటి అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఆ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత ప్లాట్‌ఫామ్ ఒక మ్యాచ్‌ను సూచిస్తుంది. అంతేకాదు.. సింగపూర్ జాతీయ డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థను ఉపయోగించి ఎదుటి వ్యక్తి నిజమైన వ్యక్తేనా అనే విషయాన్ని కూడా ధృవీకరించుకోవచ్చు.
అసలు ప్రభుత్వానికి ఈ డేటింగ్ గోల ఎందుకు?
గత కొన్ని ఏళ్లుగా సింగపూర్‌లో జననాల రేటు భారీగా పడిపోతోంది. ఆ దేశ Total Fertility Rate గత ఏడాది 0.87కి పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇది 0.97గా ఉంది. అంటే భవిష్యత్తులో దేశ జనాభా నిర్మాణమే మారిపోయే పరిస్థితి.ఒకవైపు పిల్లలు పుట్టడం తగ్గుతోంది. మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతోంది.
సింగపూర్ త్వరలో Super-Aged Societyగా మారే దశలో ఉంది. 2030 నాటికి ఆ దేశ పౌరుల్లో ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారై ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త సమస్యపై దృష్టిపెట్టింది.
“ప్రజలు పిల్లలను ఎందుకు కనడం లేదు?”
దానికి సమాధానం కేవలం డబ్బు కాదని ప్రభుత్వానికి అర్థమవుతోంది. పెళ్లిళ్లు తగ్గితే.. కుటుంబాలు తగ్గుతాయి. కుటుంబాలు తగ్గితే.. పిల్లలు తగ్గుతారు. పిల్లలు తగ్గితే.. భవిష్యత్తులో పని చేసే యువ జనాభా తగ్గుతుంది. అందుకే మొదటి మెట్టు దగ్గరే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చూస్తోంది. మనుషులు కలవాలి. సంబంధాలు ఏర్పడాలి. కుటుంబాలు ఏర్పడాలి. అందుకోసమే FirstDate.
డబ్బు ఇస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు జోడీ కూడా చూస్తోంది!
సింగపూర్ ప్రభుత్వం పిల్లలను కనాలని ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయాన్ని కూడా పెంచుతోంది. ప్రధాని Lawrence Wong ప్రకటించిన ప్రణాళిక ప్రకారం, ఒక బిడ్డకు 17 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులకు 55,000 సింగపూర్ డాలర్లకు (దాదాపు 35 లక్షలు) పైగా ఆర్థిక సహాయం అందించే చర్యలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఒకేసారి రెండు వైపులా ప్రయత్నిస్తోంది. ముందు జోడీ కుదరాలి.. ఆ తర్వాత పిల్లల్ని పెంచడానికి ఆర్థిక సహాయం అందాలి. ఇదంతా చూస్తే FirstDate సాధారణ డేటింగ్ యాప్ కాదనే విషయం అర్థమవుతుంది. ఇది ఒక దేశం ఎదుర్కొంటున్న Demographic Crisisకు టెక్నాలజీతో ఇచ్చే సమాధానం.
అయితే అసలు ప్రశ్న ఇదే.. ప్రేమను అల్గారిథమ్ నిర్ణయించగలదా?
ఒక వ్యక్తికి నచ్చే సంగీతం, ఆహారం, జీవనశైలి, విలువలు, ఆసక్తులు వంటి అంశాలను డేటాగా మార్చవచ్చు. కానీ ప్రేమ? , ఆకర్షణ?, ఎమోషన్? ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి? వీటిని కూడా అల్గారిథమ్ లెక్కించగలదా? ఒక జోడీ లెక్కల పరంగా “సరైన మ్యాచ్” కావచ్చు. కానీ జీవితంలో కూడా అదే విధంగా పనిచేస్తుందా?.సింగపూర్ ప్రస్తుతం చేస్తున్న ఈ ప్రయోగం భవిష్యత్తులో మరిన్ని దేశాలకు ఒక మోడల్‌గా మారుతుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే సింగపూర్ మాత్రమే కాదు.. ఆసియాలోని అనేక దేశాలు జననాల రేటు పడిపోవడం, జనాభా వృద్ధాప్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
రేపటి డేటింగ్ యాప్ ఎలా ఉండబోతోంది?
ఈ రోజు మనం డేటింగ్ యాప్‌లోకి వెళ్లి మనకు నచ్చిన వ్యక్తిని వెతుకుతున్నాం. రేపు మాత్రం పరిస్థితి ఇలా ఉండొచ్చు: “మీ డేటా మేము విశ్లేషించాం. మీకు సరిపోయే వ్యక్తిని మేమే కనుగొన్నాం.” అని చెప్తుంది.
ప్రేమ కోసం మనుషులు యాప్‌లను ఉపయోగిస్తున్నారా? లేకపోతే భవిష్యత్తులో యాప్‌లే మనుషుల కోసం ప్రేమను వెతుకుతాయా?సింగపూర్‌లో ప్రారంభమైన FirstDate ప్రయోగం.. వీటిన్నటికి ఏ మేరకు సమాధానం చెప్తుందో వేచి చూడాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








