ఏపీ సర్కార్ కొత్త పాలసీ.. ఇన్ఫ్లుయెన్సర్ పోస్టుల కోసం పెరుగుతున్న పోటీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల (Social Media Influencers)ను గుర్తించడం, వారికి అధికారికంగా అవకాశం కల్పించడం, అవసరమైన చోట రెమ్యునరేషన్ (Remuneration) అందించేందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ద్వారా ఏర్పడుతున్న ఉద్యోగాలు, ఇప్పటివరకు కల్పించిన ఉపాధి వంటి అంశాలను డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు వివరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఇప్పటికే పలువురు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు (Content Creators) తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం చేస్తున్నారు. అయితే కొత్త విధానం అమల్లోకి వస్తే ఇలాంటి ప్రచారాన్ని ఒక వ్యవస్థీకృత విధానంలోకి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది. ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను ఎంపిక చేయాలి, ఒక్కో జిల్లాకు ఎంత ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఎంపికకు ఎలాంటి ప్రమాణాలు ఉండాలి అనే అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ నెల 15 నాటికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇన్ఫ్లుయెన్సర్ అవకాశాల కోసం పలువురు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం (Visakhapatnam), విజయవాడ (Vijayawada), తిరుపతి (Tirupati) ప్రాంతాలకు చెందిన కొందరు కంటెంట్ క్రియేటర్లు మంత్రులను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. తమకు ఉన్న ఫాలోయింగ్, వీడియోలకు వస్తున్న స్పందన, ప్రజల్లో తమకున్న గుర్తింపును ఆధారంగా చేసుకుని అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఎంపికలో వ్యూయర్షిప్ (Viewership), లైక్స్ (Likes), వీడియోలకు వచ్చే ఇతర డిజిటల్ ఎంగేజ్మెంట్ (Digital Engagement) వంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఇన్ఫ్లుయెన్సర్ల ఎంపికకు స్పష్టమైన ప్రమాణాలు ఉంటాయా, లేక ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఉంటుందా అన్న చర్చ మొదలైంది. కొందరు మాత్రం రాజకీయ సిఫారసులకు అవకాశం ఏర్పడే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్సర్ విధానంపై విమర్శలు కూడా మొదలయ్యాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao), జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetti Satyanarayana)తో పాటు పలువురు ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ నిధులతో సోషల్ మీడియా ప్రచారం నిర్వహించే విధానంలో పారదర్శకత, ఎంపిక ప్రక్రియ, జవాబుదారీతనం వంటి అంశాలపై స్పష్టత అవసరమని విమర్శకులు చెబుతున్నారు.
మరోవైపు అవకాశాల కోసం ఇన్ఫ్లుయెన్సర్లు మంత్రులను సంప్రదిస్తుండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ఆసక్తికరంగా మారింది. ఒక్కో మంత్రి వద్ద పలువురి పేర్లు పరిశీలనకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు రూపొందిస్తుంది, ఎంపిక ప్రక్రియను ఎలా నిర్వహిస్తుంది, జిల్లాల వారీగా ఎలాంటి ప్రాతినిధ్యం కల్పిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.








