ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 70 మంది ప్రభుత్వ వైద్యుల డిస్మిస్
విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైద్యుల(Government doctors) పై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఎలాంటి అనుమతి లేకుండా సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది ప్రభుత్వ వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విధులకు హాజరుకాకుండా అలసత్వం వహిస్తున్న వైద్యుల వివరాలతో కూడిన నివేదికను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (Director of Medical Education) అధికారులు రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav)కు సమర్పించారు. ఆ వివరాలను సమగ్రంగా పరిశీలించిన మంత్రి, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన 70 మంది వైద్యులను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రజారోగ్య వ్యవస్థతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
విధులను నిర్లక్ష్యం చేస్తున్న మరో 193 మంది వైద్యుల జాబితా (List of Doctors) కూడా అధికారుల వద్ద సిద్ధంగా ఉంది. విచారణ అనంతరం త్వరలోనే వీరిపై కూడా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏళ్ల తరబడి విధులకు హాజరుకాకుండా ఉంటున్న 51 మంది వైద్యులను గత మే నెలలోనే ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది.








