ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై .. సర్వోత్తమ్ రెడ్డి క్లారిటీ
తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) తాను పోటీ చేస్తున్నానని కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (Sarvotham Reddy) స్పష్టం చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సుముఖంగా లేనన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలిపారు. తన అభ్యర్థితత్వంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిందని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, పార్టీకి విధేయుడుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీ ఆదేశాలను పాటిస్తానని కాంగ్రెస్ అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు.








