ఇండియా మధ్యవర్తిత్వానికి ఓకె.. మోడీ దగ్గర మంచి ఆలోచనలున్నాయన్న పుతిన్..!
రష్యా-ఉక్రెయిన్ వార్ ముగియాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ.. రష్యా అధినేత పుతిన్ మొండిపట్టుదల ముందు ఆప్రయత్నాలు వ్యర్థమవుతూ వస్తున్నాయి. దీంతో ఆర్థికంగా రష్యాను
టార్గెట్ చేయడం ద్వారా ఫలితాలు సాధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అయితే అవి అంతగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.
మరోవైపు.. పుతిన్ కు మిత్రధర్మంగా యుద్ధవిరమణ గురించి గుర్తు చేస్తూ వస్తున్నారు మోడీ. ఎప్పుడు యుద్ధం ముగిస్తారని ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే నేరుగా అందులో జోక్యం చేసుకోవడం లేదు. ఇదే విషయాన్ని పుతిన్ సైతం .. పలుమార్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు.ఉక్రెయిన్‌తో యుద్ధం (Ukraine conflict) ముగింపు గురించి తరచూ తమపై ఒత్తిడి తెచ్చే ప్రపంచ నేతల్లో మోడీ ఒకరని పేర్కొన్నారు. యుద్ధం విషయంలో పరస్పర ఆమోదయోగ్యమైన శాంతియుత పరిష్కారాలు సాధించడానికి ఆయన వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయన్నారు.
రష్యాతో స్నేహపూర్వక, వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్‌లోని సంఘర్షణ విషయంలో మోడీ తటస్థ వైఖరి అవలంబిస్తున్నారన్నారు. తనను కలిసినప్పుడల్లా యుద్ధం ఎప్పుడు ముగించబోతున్నారంటూ ప్రశ్నిస్తుంటారని పేర్కొన్నారు. ఈ విషయంలో మోడీ చేస్తోన్న ప్రయత్నాలకు, నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
భిన్నత్వంలో ఏకత్వం భారత్ గొప్పదనం..
ఈ సందర్భంగా పుతిన్ భారత దేశ సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత (India’s culture and unity)పై ప్రశంసలు కురిపించారు. ‘150 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో 60 కోట్ల మంది హిందీ మాట్లాడతారని.. మిగతావారు తమ సొంత భాషలను మాట్లాడతారని.. అయినప్పటికీ వారంతా ఎలాంటి భేదాలు లేకుండా కలిసి ఉంటారని మోడీ నాతో చెప్పారు. ఇది నిజంగా అద్భుతం. ఈ వైవిధ్యం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం గురించి చెప్పడానికి భారత సంస్కృతిని ఉదాహరణగా చూపించవచ్చు. ఈ విధానాన్ని అన్ని దేశాలు నేర్చుకోవాలి’ అని పేర్కొన్నారు.








