ఫ్లై దుబాయ్ ఘటన వెనక ఉగ్రకోణం..
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దబాయ్ విమానం ఘటన వెనక ఉగ్రకోణం ఉందన్న విషయం వెలుగుచూస్తోంది. ఎందుకంటే ఈ దుశ్చర్యకు పాల్పడిన కో పైలట్.. ఒమన్ దేశస్తుడు హమామ్ అల్హమామి గత చరిత్ర నేరమయంగా ఉంది. తీవ్రవాదభావజాలం కారణంగా గతంలో అతనిపై ఒమన్ అధికారులు ..విమాన ప్రయాణాలపై నిషేధం విధించినట్లు సమాచారం.
యూఏఈలో జన్మించిన హమామ్ తండ్రి ఒమన్‌కు చెందినవాడు కాగా, తల్లి సిరియన్. సిరియాలో ఎక్కువ కాలం గడిపిన అతడు, అక్కడ ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు తెలుస్తోంది. 2024లో ఒమన్ ఎయిర్‌లో కో-పైలట్‌గా శిక్షణ పొందుతున్న సమయంలో, అతడి వద్ద ఉగ్రవాద సంబంధిత మెటీరియల్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతడిని ఫ్లయింగ్ డ్యూటీల నుంచి తొలగించి, పరిపాలన విభాగానికి బదిలీ చేశారు.
అయినప్పటికీ, హమామ్ ఫ్లైదుబాయ్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం గమనార్హం. సుమారు 8 నెలలుగా అక్కడ పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానంలో భారత కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కాక్‌పిట్‌లో కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో విమానం వేల అడుగుల కిందకు దూసుకెళ్లగా, ప్రయాణికులు, సిబ్బంది కలిసి హమామ్ను బంధించారు. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఒమన్‌లో నిషేధానికి గురైన వ్యక్తికి ఫ్లైదుబాయ్ ఎలా ఉద్యోగం ఇచ్చిందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై యూఏఈ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుండగా, ఫ్లైదుబాయ్ తాత్కాలికంగా టెల్అవీన్కు తన సర్వీసులను నిలిపివేసింది.








