మాపై దాడికి దిగితే అణుయుద్ధమే.. నాటోకు పుతిన్ తీవ్ర హెచ్చరిక…
యూరప్ దేశాలపై దాడి చేయాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు రష్యా అధినేత పుతిన్. అసలు అలాంటి ప్రతిపాదనలు తమవద్ద లేవన్నారు.వాటితో శాంతియుత సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నాం. అయితే, కలినిన్‌గ్రాడ్ సహా ఇతర రష్యా భూభాగంపై యూరప్ దేశాలు ప్రత్యక్ష దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అదే జరిగితే మా వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో పాటు అణ్వాయుధాలనూ (Nuclear Weapons) ప్రయోగిస్తాం’’ అని నాటో దేశాలను పుతిన్ హెచ్చరించారు.
ఉక్రెయిన్ విషయంలో ఉద్రిక్తతలను పెంచొద్దని యూరోపియన్ యూనియన్ ను కోరారు పుతిన్. మాస్కోలోని వాల్డాయ్ ఫోరంలో మాట్లాడుతూ.. ‘‘ఏ యూరోపియన్ దేశంపైనా దాడి చేసే ప్రణాళికలు రష్యాకు లేవు. అదే సమయంలో తమపై ఉక్రెయిన్ జరిపే దాడులకు మద్దతిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
నాటో (Nato) సభ్య దేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న కలినిన్‌గ్రాడ్.. రష్యాకు వ్యూహాత్మకంగా కీలకమని పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధించడానికి కూటమి ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అది ప్రపంచ దేశాలకే ప్రమాదమన్నారు. సైనికపరంగా నాటో రష్యాకంటే రెండింతలు పెద్దదని పుతిన్ గుర్తు చేశారు. ఫ్రాన్స్, బ్రిటన్ అణు సామర్థ్యాలపై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. అయినప్పటికీ ఈ పోటీలో తామే ఆధిక్యత సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
నల్ల సముద్ర ప్రాంతంలోని ఉక్రెయిన్ లక్ష్యాలపై దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు. మాస్కోలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల వల్ల తమ జీడీపీలో సుమారు 1శాతం నష్టం వాటిల్లిందన్నారు. నాటో విస్తరణ, యూరప్ దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం (Russia-Ukraine) కొనసాగుతోందన్నారు.








