హాకీ జట్టు మాజీ కెప్టెనే.. పంజాబ్ పీసీసీ కెప్టెన్
చండీగఢ్ : పంజాబ్ పీసీసీకి కొత్త అధ్యక్షుడ్ని కాంగ్రెస్ నియమించింది. అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్థానంలో మాజీ ఒలింపియన్, భారత హాకీ జెట్టు మాజీ కెప్టెన్ పర్గత్ సింగ్ పీసీసీ చీఫ్ గా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం జలంధర్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా వున్నారు. వారింగ్ పీసీసీ చీఫ్ గా రాజీనామా చేయడంతో, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సచిన్ పైలట్ అన్ని వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాతే పర్గత్ సింగ్ నియామకం జరిగింది.
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ వ్యవహారాల AICC కార్యదర్శిగా ఉన్న మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పర్గత్ సింగ్‌కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి బలమైన మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మార్గం సుగుమం అయ్యింది. అంతేకాకుండా పర్గత్ సింగ్ అన్ని వర్గాలకూ అనుకూలురని పేరు వహించారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా హిందూ వర్గానికి చెందిన విజయ్ ఇందర్ సింగ్లాను నియమించాలని కాంగ్రెస్ పరిశీలించినప్పటికీ, చివరికి జాట్ సిక్ అయిన వారింగ్ స్థానంలో మరొక జాట్ సిక్నే ఎంపిక చేసింది. అయితే రాష్ట్ర మంత్రివర్గ మాజీ సభ్యుడు, ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు మరియు రాష్ట్ర విభాగంలో హిందూ ముఖంగా ఉన్న ఒక నేతకు అనుకూలంగా, సింగ్లాకు వ్యతిరేకంగా చివరి నిమిషంలో లాబీయింగ్ జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత నెలలో పార్టీ తన కేంద్ర ఇన్ఛార్జ్ను మార్చి, భూపేష్ బఘేల్ స్థానంలో పైలట్‌ను నియమించిన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుంది.వారింగ్ మరియు మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని వర్గాల మధ్య ప్రధానంగా సాగిన పోరులో బఘేల్ పక్షపాత ధోరణితో వ్యవహరించినట్లు పెద్ద ఎత్తున విమర్శలు సైతం వచ్చాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో పర్గత్ సింగ్ తటస్థంగానే వున్నారు.
అంతేకాకుండా నవజ్యోత్ సింగ్ సిద్దు పీసీసీ చీఫ్ గా వున్న సమయంలో పర్గత్ సింగ్ సంస్థాగత బాధ్యతలను కూడా నిర్వహించారు. 2021 లో సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా వున్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికల దిశగా పార్టీని నడిపించే క్రమంలో, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న పలువురు నాయకులు ఉన్న ఆ రాష్ట్ర విభాగంలోని వర్గాలను ఏకం చేయాల్సిన సవాలు సింగ్ ముందుంది. అలాగే, వివిధ వర్గాల నాయకుల మధ్య సమన్వయం సాధించడంతో పాటు, సంస్థాగత బలోపేతానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఎన్నికల పోరు కోసం కాంగ్రెస్‌ను ఆయన సిద్ధం చేయాల్సి ఉంటుంది.








