వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
ఉత్తరాంధ్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో(YSRCP) అసమ్మతి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైసీపీకి అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి పార్టీ అధిష్ఠానానికి ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని(YS Jagan) టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
వైఎస్సార్సీపీ అనేది ఒక రాజకీయ పార్టీలా కాకుండా పూర్తిగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుస్తోందని, తనపై ఎటువంటి కారణం లేకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. పార్టీలోని సీనియర్ నేతలను ఉద్దేశించి బడ్డుకొండ అప్పలనాయుడు సంచలన ప్రశ్నలు సంధించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినట్లు చెప్తూ తనపై చర్యలు తీసుకున్న అధిష్ఠానం.. బొత్స సత్యనారాయణపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నేరుగా జగన్ను నిలదీశారు.
వైఎస్ జగన్ ఒక కరడుగట్టిన నియంతలా వ్యవహరిస్తున్నారని, పార్టీలో ప్రజాస్వామ్యం అనేది ఎక్కడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. జగన్ తీసుకున్న ఏకపక్ష, ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్లే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ నైజం మారలేదని, అందుకే తాము పార్టీలో కొనసాగలేక బయటకు వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాజీనామాతో విజయనగరం జిల్లాలో వైసీపీ క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది.








