సోదరులు కలిశారు… రాజకీయాలను మార్చేస్తారా?
మహారాష్ట్రలో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. రాజకీయ విరోధులుగా వుంటూ, ఎడ మొహం, పెడ మొహంగా వున్న ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే మళ్లీ కలుస్తున్నారా? రాజకీయ కారణాల రీత్యా శివసేను నంచి విడివడి, రాజ్ థాకరే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన స్థాపించుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఉద్ధవ్, రాజ్ థాకరే మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. తానే బాల్ థాకరే వారసుడ్ని అని పరోక్షంగా రాజ్ థాకరే చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ఉద్ధవ్ ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది.
అయితే కొన్ని రోజులుగా ఈ ఇద్దరు సోదరులు తిరిగి కలిసిపోయినట్లు సంకేతాలిస్తున్నారు. ఇద్దరి మధ్య రాజకీయ విమర్శలు కూడా తగ్గాయి. తాజాగా మరో అడుగు ముందుకే వేసి, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరియు ఎన్నికల కమిషన్ పనితీరుకు వ్యతిరేకంగా శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే ఆదివారం ముంబైలో కలిసి ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమానికి విరాట్ గర్జన మోర్చా గా నామకరణం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో జరిగినట్లు ఆరోపించబడిన అవకతవకలను వ్యతిరేకిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. నిరసనకారులు సీఈసీ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని లేదా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం పనితీరుకు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా వారి వారి పార్టీలు నిరసన కొనసాగిస్తున్న తరుణంలో ఉద్ధవ్, రాజ్ థాకరేలు సంయుక్తంగా పాల్గొన్నారు.దీంతో ఇద్దరు సోదరుల ఐక్యతపై మరోసారి దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఈ ర్యాలీ తర్వాత.. భవిష్యత్ కార్యాచరణ, దశా దిశపై కూడా చర్చించనున్నారు.








