అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు… హిందూ సంఘాల మండిపాటు!
అమెరికా గడ్డపై మరోసారి హిందూ ప్రార్థనా మందిరంపై దుండగుల దుశ్చర్య వెలుగు చూసింది. ఒహాయో రాష్ట్రంలోని గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలో విరాజిల్లుతున్న ప్రసిద్ధ ‘శ్రీ స్వామినారాయణ హిందూ టెంపుల్ వడ్తాళ్ధామ్’పై కొందరు దుండగులు ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆలయ భవనం కొంత మేర దెబ్బతిన్నట్లు సమాచారం. దాడి ధాటికి ఆలయ కిటికీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో ఆలయ ప్రాంగణంలో పూజారులు, కొందరు భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అనే కోణంలో పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
తీవ్ర నిరసనలు..
అమెరికాలో ఆలయంపై జరిగిన ఈ దుశ్చర్య పట్ల ‘నార్త్ అమెరికా హిందువుల సంఘం’ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దారుణ ఘటనను రిచ్మండ్ హైట్స్ మేయర్ కిమ్ థామస్ తో పాటు నగర అధికారులు తీవ్రంగా ఖండించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన నిందితులను వెంటనే గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరింది.
అదేవిధంగా, ప్రముఖ ప్రజాస్వామ్య వేదిక హిందూ అమెరికన్ ఫౌండేషన్(HAF) కూడా ఈ దాడిని ఖండించింది. అమెరికాలో హిందూ అమెరికన్ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత చర్యలు, కామెంట్లు క్రమంగా పెరుగుతున్నాయని, ఈ తరుణంలో ఇలాంటి దాడులు జరగడం ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోందని హెచ్ఏఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించిన నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని హెచ్ఏఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా డిమాండ్ చేశారు.
ఉత్సవాల వేళ కలవరపరుస్తున్న పరిణామాలు
మరో పది రోజుల్లో రాబోయే నవరాత్రి ఉత్సవాలతో పాటు వైభవంగా నిర్వహించే ‘హిందూ హెరిటేజ్ మంత్’ వేడుకల కోసం అక్కడి భారతీయ-అమెరికన్ సమాజం సర్వం సిద్ధమవుతున్న వేళ ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాలో హిందూ ప్రార్థనా స్థలాలు, ఆలయాలపై ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఇటువంటి ఘటనలు నమోదయ్యాయి.
2022లో న్యూయార్క్‌లోని శ్రీ తులసీ మందిర్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలాగే 2023లో కాలిఫోర్నియాలోని నెవార్క్లో స్వామినారాయణ ఆలయంపై పిచ్చి రాతలు రాశారు. ఇక 2024లో సైతం న్యూయార్క్ , కాలిఫోర్నియా రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మక బీఏపీఎస్ (BAPS) ఆలయాలపైనా దాడులు జరిగినట్లు పలు హిందూ సంస్థలు గుర్తుచేశారు. ప్రవాస భారతీయులకు రక్షణ కల్పించే దిశగా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని భారతీయ ఎన్నారైలు కోరుతున్నారు.








