సింగీతం శ్రీనివాసరావు సినీ ప్రస్థానం ప్రయోగాలు
తెలుగు సినీ పరిశ్రమలో కొత్తగా ఏదైనా ప్రయోగం చేయాలంటే… ఆనాటి నుండి నేటివరకు గుర్తు వచ్చే మొదటి పేరు సింగీతం…. ఆయన లేకపోవడం భారతీయ సినిమాకు ఒక తీరని లోటు ఆయన మృతి పట్ల తెలుగు టైమ్స్ సంతాపం ప్రకటిస్తూ…. ఆయన సినీ ప్రస్థానం సింహావాలోకనం చేసుకుంటే….
సింగీతం శ్రీనివాసరావు సెప్టెంబర్ 21, 1931న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. మూకీ చిత్రం నుంచి సైన్స్ ఫిక్షన్, సంగీతభరిత ప్రయోగాల వరకు వైవిధ్యమైన చిత్రాలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అరుదైన దిగ్గజ దర్శకుడు ఆయన. తెలుగు సినిమా చరిత్రలో కొందరు దర్శకులు కమర్షియల్ విజయాలతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ ఆలోచనలతోనే ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. అలాంటి అరుదైన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. మూసధోరణికి భిన్నంగా సినిమాలు తీయడం, కథ చెప్పే పద్ధతిలో కొత్త ప్రయోగాలు చేయడం, ప్రేక్షకుల ఊహలకు అందని కథాంశాలను తెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 60 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం. సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి కన్నుమూశారు.
ఈ సందర్భంగా ఆయన లైఫ్ జర్నీని చూస్తే.సినిమాల్లోకి రాకముందు జీవితం
సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబర్ 21న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరిలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కళలు, సాహిత్యం, నాటకాలపై ఆసక్తి ఉండేది. చదువులోనూ ప్రతిభ కనబరిచిన ఆయన మద్రాస్ యూనివర్సిటీ నుంచి భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. సైన్స్ చదివినప్పటికీ ఆయన మనసు మాత్రం కళల వైపు ఉండేది. ముఖ్యంగా నాటకరంగంపై ఉన్న ఆసక్తితో తెలుగు నాటకాలు రచించడం, వాటిని ప్రదర్శించడం చేసేవారు. ఆయన రచించిన నాటకాలకు పలు పోటీల్లో గుర్తింపు కూడా లభించింది. సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి ముందు నాటకరంగంలో సంపాదించిన అనుభవం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. కథను ఎలా నడిపించాలి? ప్రేక్షకుల్లో ఆసక్తిని ఎలా పెంచాలి? భావాలను మాటలతోనే కాకుండా దృశ్యాలతో ఎలా వ్యక్తీకరించాలి? అనే అంశాలపై అప్పుడే అవగాహన పెంచుకున్నారు.
దిగ్గజ దర్శకుడి దగ్గర శిష్యరికం…
సింగీతం సినీ ప్రయాణంలో ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన కె.వి.రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. 1958లో విడుదలైన ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. అక్కడే సినిమా నిర్మాణంలోని సాంకేతిక అంశాలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నటీనటుల నుంచి నటన రాబట్టే విధానం వంటి విషయాలను నేర్చుకున్నారు. ఆ తర్వాత కన్నడ చిత్రం ‘సంస్కార’కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమా 1970లో జాతీయ స్థాయిలో రాష్ట్రపతి స్వర్ణ పతకాన్ని అందుకుంది. అనంతరం 1972లో ‘నీతి నిజాయితీ’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అన్ని జానర్లలోనూ సింగీతం తనదైన ముద్ర
సింగీతం శ్రీనివాసరావు కెరీర్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆయన ఎంచుకున్న కథలు. ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా కుటుంబ కథలు, హాస్యం, ప్రేమకథలు, సైన్స్ ఫిక్షన్, జానపద చిత్రాలు, ప్రయోగాత్మక సినిమాలు తెరకెక్కించారు.
సింగీతం దర్శకత్వంలో వచ్చిన ముఖ్యమైన చిత్రాలు
నీతి నిజాయితీ, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, సొమ్మొకడిది సోకొకడిది, మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం, మేడమ్, శ్రీకృష్ణార్జున విజయం, మైఖేల్ మదన కామరాజన్, అపూర్వ సహోదరులు, లిటిల్ జాన్, ఘటోత్కచుడు, వెల్కమ్ ఒబామా.
ఈ సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించగా, మరికొన్ని సినిమా మేకింగ్‌లో కొత్త ఒరవడికి నాంది పలికాయి. తెలుగు సినిమా దశ దిశని మార్చేశాయి. ఇండియన్ సినిమాలోనే సింగీతం ఒక సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారని చెప్పొచ్చు. మన వద్ద హాలీవుడ్ పోకడలను పనిచయంచేసింది కూడా ఆయనే. అడ్వాన్స్ ఆలోచనతో ఆకట్టుకున్నారు. జయాపజయాలకు అతీతంగా సినిమాని ఒక సెలబ్రేట్ చేసుకునేలా చేశారు సింగీతం.








