వైసీపీకి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు లేదు: రామ్మోహన్ నాయుడు
బీసీ రిజర్వేషన్ల (BC reservations,) అంశంపై మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం వైసీపీకి లేదని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు (Govinda Rao)తో కలిసి పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన వైఎస్సార్సీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీలకు రాజ్యాధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కకూడదనే కుట్రతోనే గత వైసిపి ప్రభుత్వం (YCP government) రిజర్వేషన్లను అడ్డుకుందని ఆరోపించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీసీ కోటాపై కోర్టు తీర్పు వెలువడినప్పటికీ, అప్పటి జగన్ ప్రభుత్వం దానిని కాపాడుకోవడానికి ఎందుకు పోరాడలేదని ఆయన సూటిగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను పక్కాగా అమలు చేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court)లో గట్టిగా పోరాడుతోందని తెలిపారు. గతంలో తొలిసారిగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని గుర్తుచేశారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా సమాజంలో ఉన్నత స్థానాల్లో రాణించాలన్నదే టీడీపీ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.








