కూచిపూడిలోని సంజీవని ఆసుపత్రి అరుదైన మైలురాయి.. ఒక్క నెలలోనే 5,328 మందికి వైద్య సేవలు!
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యుత్తమ , నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న సిలికానాంధ్ర-రవిప్రకాశ్ సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సరికొత్త రికార్డును సృష్టించింది. 2026 సెప్టెంబర్ నెలలో ఒక్క నెల వ్యవధిలోనే ఈ ఆసుపత్రి ద్వారా ఏకంగా 5,328 మంది రోగులకు విజయవంతంగా వైద్య సేవలు అందించినట్లు సిలికానాంధ్ర సంస్థ ఫౌండర్ ఆనంద్ కూచిభొట్ల వెల్లడించారు.
సంజీవని ఆసుపత్రి చరిత్రలో ఒకే నెలలో 5,000 మందికి పైగా రోగులకు వైద్యం అందించడం ఇదే మొదటిసారని, ఇది ఒక చారిత్రక ఘట్టమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
వైద్య సిబ్బంది అంకితభావమే ఈ విజయానికి నిదర్శనం
సంజీవని వైద్య బృందం ప్రదర్శించిన అంకితభావం, నిరంతర కృషి , సమాజం తమపై ఉంచిన ప్రగాఢ నమ్మకమే ఈ అరుదైన మైలురాయి సాధనకు ప్రధాన కారణమని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
ఈ వేదికగా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం ద్వారా వేలాది కుటుంబాలకు భరోసా , ఆరోగ్య భద్రతను కల్పించగలుగుతున్నామని వారు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మరిన్ని ఆధునిక వైద్య సేవలను మరింత చేరువ చేస్తామని స్పష్టం చేశారు.








