ఫిబ్రవరి 3న క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు ఐఐటీయన్ల మేధస్సు
వరల్డ్ పాన్ ఐఐటీ కౌన్సిల్‌కు వేదికగా అమరావతి
డీప్ టెక్ స్టార్టప్ ల కోసం రూ.500 కోట్లతో పాన్ ఐఐటీ వెంచర్ ఫండ్
100 మందితో గ్లోబల్ ఐఐటీ మెంటర్ల నెట్ వర్క్
ఏపీకి టెక్నాలజీని ట్రాన్సఫర్ చేసేందుకు 23 ఐఐటీల అంగీకారం
పాన్ ఐఐటీ ఏపీ 2026 సదస్సులో సీఎం సమక్షంలో డిక్లరేషన్ విడుదల
క్యు-శివ పేరుతో ఐదు క్వాంటం కంప్యూటర్లను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
2027 ఫిబ్రవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్లు
విజయవాడ, అక్టోబరు 03: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఐఐటియన్ల మేధస్సు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలతో పాటు దేశాభివృద్ధి కోసం వారంతా అనుసంధానమై నెట్వర్క్ గా ఏర్పడాలని ఆయన సూచించారు. శనివారం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026లో పాల్గొన్న ముఖ్యమంత్రి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ నాలెడ్జ్, డీప్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడ్డాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పాటు, డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్ల పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యు-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటం కంప్యూటర్లను ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్ రూపొందించిన ఈ కంప్యూటర్లు మినీ టెస్టింగ్ క్వాంటం కంప్యూటర్ ల్యాబ్‌లుగా ఉపయోగ పడనున్నాయి. 4 కెల్విన్ ప్రాసెసర్ సృష్టిని కూడా సీఎం ఆవిష్కరించారు. మేడిన్ అమరావతి బ్రాండ్ సృష్టించేలా క్వాంటం కంప్యూటర్ల తయారీకి శ్రీకారం చుట్టడం రాష్ట్రంలో డీప్‌టెక్ ఉత్పత్తుల తయారీ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. క్యు-శివ కంప్యూటర్ల తయారీలో కీలకంగా వ్యవహరించిన చండీగఢ్ యూనివర్సిటీ, క్యూబిట్ ఫోర్స్ ప్రతినిధులను సీఎం అభినందించారు. క్యు-శివ క్వాంటం కంప్యూటర్లను తయారు చేయడానికి అసరమైన కాంపోనెంట్లు మచిలీపట్నంలోనే లభ్యమవుతున్నాయని ఈ సందర్భంగా క్యూబిట్ సంస్థ సీఈఓ వివరించారు.
అమరావతిలో క్వాంటం ఎకోసిస్టం అభివృద్ధి
దేశంలోని 23 ఐఐటీలు ప్రపంచానికి అత్యుత్తమ మేధస్సును అందించాయని, జాతి నిర్మాణంలో ఐఐటీయన్ల పాత్ర కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేలా ఐఐటీయన్లు తమ మేధస్సును వినియోగించాలని కోరారు. సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడినట్లే ఇకపై అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం మాట్లాడుతుందన్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించి ఇప్పటికే టెస్ట్ బెడ్లు అందుబాటులోకి వచ్చాయని సీఎం తెలిపారు. ఐబీఎం–టీసీఎస్, ఎల్అండ్టీ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి ఆపరేట్ కానుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. 156 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ అందుబాటులోకి వచ్చేలోగానే అమరావతిలో క్వాంటం టెక్నాలజీకి అవసరమైన మౌలిక వసతులు సిద్ధమవుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్లను మాత్రమే కాకుండా వాటికి అవసరమైన పరికరాలను కూడా తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి ఏపీ ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. భారత్, ఆంధ్రప్రదేశ్ కేవలం టెక్నాలజీ వినియోగదారులుగా కాకుండా ఉత్పత్తిదారులుగా ఎదగాలని సీఎం పిలుపునిచ్చారు. వచ్చే రెండేళ్లలో కమర్షియల్ క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తికి అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రాష్ట్రంలో నైపుణ్యాలు, పరిశోధన, తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఐఐటీ స్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని, ఆరో తరగతి నుంచే విద్యార్థుల్లో ఎంట్రప్రెన్యూర్షిప్ నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీనికి ఐఐటీల సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు.
మంచి ఆలోచన ఆచరణలో పెడితే విప్లవం
వినూత్న ఆలోచనలకు తాను ఎప్పుడూ ప్రాధాన్యమిస్తారనని సీఎం చెప్పారు. రాళ్ల సీమగా ఉన్న రాయలసీమను రతనాల సీమగా మార్చాలనే ఆలోచన నుంచే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటైందని తెలిపారు. ఇప్పుడు ఈ హబ్ ద్వారా రాయలసీమలో విప్లవాత్మకమైన అభివృద్ధి వస్తుందన్నారు. 20 రకాల ఫలాలు ఉత్పత్తి అవుతున్న రాయలసీమను సమర్థవంతమైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతికతతో వచ్చే పదేళ్లలో ప్రపంచ ఉద్యానవన హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి రిలయన్స్ సంస్థ సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. దేశంలో కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఏపీ నుంచి 50 లక్షల మంది ఏఐ నిపుణులను అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని సీఎం వెల్లడించారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటే అభివృద్ధి లక్ష్యాలను మరింత వేగంగా చేరుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.
పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్ డిక్లరేషన్
సమ్మిట్ లో జరిగిన సుదీర్ఘ మేథోమధనం అనంతరం పాన్ ఐఐటీ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వం ఉమ్మడిగా డిక్లరేషన్ విడుదల చేశాయి. అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలను అనుసంధానం చేసే వేదికగా ఈ కౌన్సిల్ పని చేయనుంది. దేశంలోని 23 ఐఐటీల నుంచి వచ్చిన సుమారు 5 లక్షల మంది ఐఐటీయన్ల మేధస్సును ఏపీ అభివృద్ధికి వినియోగించుకునేలా ఈ నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దనున్నారు. డీప్‌టెక్ అభివృద్ధికి పాన్ ఐఐటీ అమరావతి కౌన్సిల్ నోడల్ సంస్థగా పనిచేయనుంది. 23 ఐఐటీలు, 25 ఇన్నోవేషన్ హబ్‌ల నుంచి సాంకేతికతలను గుర్తించి వాటిని ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఉత్పత్తుల అభివృద్ధికి అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను పాన్ ఐఐటీ ఎకోసిస్టంతో అనుసంధానం చేసి పరిశోధన, ఫ్యాకల్టీ, విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు 10 ఇండస్ట్రీ చాప్టర్లను ఏర్పాటు చేసి పరిశోధన, నైపుణ్యాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది ఐఐటీ మెంటర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి ఏపీ స్టార్టప్‌లు, ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేయనున్నారు. 2030 నాటికి రాష్ట్రంలో కనీసం 50 స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. క్వాంటమ్-ఏఐ, సెమీకండక్టర్లు, స్పేస్-డిఫెన్స్, హెల్త్, అగ్రిటెక్, బ్లూ వాటర్ ఎకానమీ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా డీప్‌టెక్ పాలసీ ప్యాకేజీ కింద చర్యలు చేపట్టనున్నారు. రూ.500 కోట్ల వెంచర్ ఫండ్‌ను డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీలకు పెట్టుబడులుగా వినియోగించనున్నారు.
వివిధ రంగాలపై ప్యానెల్ డిస్కషన్లు
రెండు రోజుల పాటు జరిగిన పాన్ ఐఐటీ సదస్సులో ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ తిరుపతి, ఐఐటీ జమ్మూ, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ధన్‌బాద్, ఐఐటీ వారణాసి, ఐఐటీ భువనేశ్వర్ తదితర సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఐఐటీల సీఈఓలు, వెంచర్ క్యాపిటలిస్టులతో రెండు రోజు సదస్సులో సీఎం సమావేశమై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు, టెక్నాలజీ బదిలీ, పట్టణీకరణలో డీప్‌టెక్ వినియోగం, స్టార్టప్‌లు, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ప్రతి ఏడాది పాన్ ఐఐటీ సమ్మిట్ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించాలని సీఎం ప్రతిపాదించారు. అంతకుముందు ఇంధనం, స్వచ్ఛాంధ్ర, నిత్య జీవితంలో డీప్ టెక్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు, అగ్రిటెక్-రైతులు, నీటిభద్రత తదితర అంశాలపై పాన్ ఐఐటీ సదస్సులో చర్చలు జరిగాయి. పాన్ ఐఐటీ సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం ఆసక్తిగా తిలకించారు.








