2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు… 9లక్షల ఇళ్లతో పేదలకు పట్టాభిషేకం: సీఎం చంద్రబాబు
9 లక్షల ఇళ్లతో పేదలకు పట్టాభిషేకం
2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు
3 లక్షల ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెం నుంచి శ్రీకారం
మరో 6 లక్షల ఇళ్ల మంజూరుకు కేంద్రమంత్రి హామీ
3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టుగా 177 ఇళ్ల నిర్మాణం
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న ముఖ్యమంత్రి సంకల్పం గొప్పదని చౌహాన్ వ్యాఖ్య
తెనాలి, అక్టోబరు 04:- 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ వంద శాతం పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదలకు సొంతిల్లు ఉంటే వారి జీవన ప్రమాణాలతో పాటు ఆత్మగౌరవం పెరుగుతుందని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ఆదివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు కుటుంబంతో కలిసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రానికి సాధారణ కోటా కింద 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని చంద్రబాబు తెలిపారు. ఈ 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగానే మరో 3 లక్షల ఇళ్లను, వచ్చే ఏడాది మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అంగీకరించారని చెప్పారు. మొత్తంగా 9 లక్షల ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసేందుకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. 3 లక్షల ఇళ్ల నిర్మాణం అంటే కేవలం ఇళ్ల నిర్మించడమే కాదని, 3 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పునకు శ్రీకారం చుట్టే కార్యక్రమమని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు వేసిన ఓటుతో సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ చేర్చేలా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు బుర్రిపాలెంలో రూ.14 కోట్లతో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ద్వారా 177 ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం సందర్శించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి అధికారులు వివరించారు. 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో పటిష్టమైన ఇళ్లను నిర్మించవచ్చని అధికారులు వివరించారు. ఈ సాంకేతికతతో నిర్మించే ఇళ్లలో బయట వాతావరణంతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించినట్టు సీఎం అన్నారు.
పేదలకు రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలు
పేదలకు పట్టాభిషేకంలో భాగంగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పేదలకు నివాస స్థలాలు అందించామని చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి సహా వివిధ ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు అందించామని చెప్పారు. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ అజెండా అని స్పష్టం చేశారు. గత పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని సీఎం విమర్శించారు. 2019–24 మధ్య 6 లక్షల పేదల ఇళ్లను రద్దు చేశారని, నివాసయోగ్యం కాని చెరువులు, గుట్టల్లో ఇంటి స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. దాదాపు 4 లక్షల మంది ఆ స్థలాలను వద్దంటూ వెనక్కి ఇచ్చేశారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ పేదలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి పోలవరం పూర్తయ్యేలోగా గోదావరి నీటిని వినియోగించుకున్నామని సీఎం చెప్పారు. ఎల్‌నినో వంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోనూ కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించి పంటలను కాపాడగలిగామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అంకురార్పణ చేశామని, రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఉద్యాన ఫలాల ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
షైనింగ్ ఆంధ్రా- అచీవింగ్ ఆంధ్రా : శివరాజ్ సింగ్ చౌహాన్
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. విజనరీ నేత చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ఇక షైనింగ్ ఆంధ్రా, అడ్వాన్స్డ్ ఆంధ్రా, అచీవింగ్ ఆంధ్రాగా మారుతోందని కొనియాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న చంద్రబాబు సంకల్ప బలం గొప్పదని ప్రశంసించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఏపీలో చేపడుతున్న గృహ నిర్మాణం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగానే మరో 3 లక్షల ఇళ్లకు శాంక్షన్ ఇస్తామని, ఆ తర్వాత మరో 3 లక్షల ఇళ్లను కూడా ఏపీకి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. రైతుల కోసం కేంద్రంతో కలిసి ఏపీ సీఎం అన్నదాత సుఖీభవ కింద రూ.20వేల ఆర్ధిక సహకారం అందిస్తున్నారని అన్నారు. ఏపీలోని అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు మొత్తం సుఖీభవ అనే విధానంలో ఏపీలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. వీబీజీ రామ్ జీ పథకంతో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో డ్రెయిన్లు, రోడ్లు సహా వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. ఏపీని 360 డిగ్రీల కోణంలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారన్నారు.
త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ పరిశీలన
అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టును సందర్శించారు. సీబీఆర్ఐ అధికారులు వారికి త్రీడీ టెక్నాలజీ నిర్మాణ ప్రక్రియ గురించి వివరించారు. కేవలం 10 రోజుల్లో ఒక ఇంటిని ఈ సాంకేతికతో నిర్మించే అవకాశముందని తెలిపారు. అనంతరం ఇరువురు నేతలూ ఓ లబ్దిదారు కుటుంబానికి చెందిన ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసిన అనంతరం లబ్దిదారు కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడి వారికి నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సూచికగా శిలాఫలకం ఆవిష్కరించి అక్కడికి సమీపంలోనే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం వేదికపై లక్ష్మీ అనే మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి పట్టాన అందించారు.








