ఛార్లెట్ లో తానా విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్ విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, మరోవైపు కమ్యూనిటీకీ ఎన్నో విషయాల్లో జాగ్రత్తలను తెలియజేస్తూ, చైతన్యపరిచే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అక్టోబర్ 4వ తేదీన నిర్వహించిన ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతంగా ముగిసింది. అనిశ్చిత పరిస్థితులలో కుటుంబాలకు ఆర్థిక, చట్టపరమైన భద్రతను కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రోస్పర్ రైట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారితో కలిసి తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫైనాన్షియల్, బిజినెస్ విషయాల్లో మంచి అవగాహన ఉన్న జ్యోత్స్న గంట ఈ కార్యక్రమం ద్వారా విల్ అండ్ ట్రస్ట్ కు సంబంధించిన విషయాల్లో పలు సూచనలు, సలహాలను అందించారు. కార్యక్రమంలో 120మందికిపైగా పాల్గొని తమ సందేహాలను, ఇతర విషయాలను నివృత్తి చేసుకున్నారు. తమ వీలునామాలు సిద్ధం చేసుకోవడానికి, ముఖ్యమైన కుటుంబ పత్రాలను పూర్తి చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడింది.
ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడం పట్ల ఛార్లెట్ తానా నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఛార్లెట్ తోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక కుటుంబాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి. ప్రతి ఒక్కరూ తమ పత్రాలను పూర్తి చేయడానికి సాయంత్రం వరకు వేచి ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ఈ పనిని ఎట్టకేలకు పూర్తి చేయాలనే వారి పట్టుదలను తెలియజేసింది. ప్రజల నుండి వచ్చిన విపరీతమైన స్పందనతో, ప్రతి ఒక్కరూ తమ పత్రాలను పూర్తి చేసుకునేలా ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 7:30 గంటల వరకు నిర్వాహకులు పొడిగించారు.
ఈ కార్యక్రమంలో పలు కుటుంబాలకు నోటరీ సేవలను అందించిన సతీష్ జాస్తి మరియు కోటయ్య పచ్చల గారికి, రోజంతా ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచి సహాయం చేసిన ప్రసాద్ చిగురుపాటి గారికి ప్రత్యేక ధన్యవాదాలును తెలియజేశారు. రేపటి మన కుటుంబాల భవిష్యత్తు మరియు భద్రత కోసం నేడు వేసే చిన్న అడుగు ఎంతో అర్ధవంతమైన మార్పును తెస్తుందని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. సేవా భావంతో కమ్యూనిటీ అంతా ఒకటై ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
తానా ఛార్లెట్ నాయకులు , తానా స్పెషల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి, ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేని, తానా టీమ్ స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మాధురి ఏలూరి, అప్పలాచియాన్ ప్రాంతీయ ప్రతినిధి రవి (నాని) వడ్లమూడి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి విజయవంతమయ్యేలా చూశారు.











