ఓటర్ల తొలగింపు దుమారం.. కాంగ్రెస్ ప్రత్యక్ష పోరు!
తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ఇప్పుడు తీవ్ర దుమారానికి తెరలేపింది. కేంద్ర ఎన్నికల సంఘం కుట్రపూరితంగా ఓటర్లను తొలగిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముసుగులో తెలంగాణలో ఏకంగా 90 లక్షల ఓట్లను తొలగించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి ఆందోళనలకు సిద్ధమైంది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఎన్నికల సంఘం కేంద్రంలోని అధికార బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గిందని ఆరోపించింది. ప్రతిపక్షాలకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా ఆరోపిస్తున్నాయి.
కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరుస్తూ పలు రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఓటర్ల పేర్లు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదని.. వెనుకబడిన వర్గాలు, పేదలు, ప్రజాస్వామ్య వాదుల గొంతు నొక్కేసే కుట్ర అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్యం చేసేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించింది. అక్టోబర్ 6, 7 తేదీలలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసనలు, ర్యాలీలు నిర్వహించాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అలాగే అక్టోబర్ 8న లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
ఈ పోరును కేవలం పార్టీ పరమైన ఆందోళనగానే కాకుండా, ప్రజా ఉద్యమంగా మలచాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే కుల సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు కోరుతూ లేఖలు రాయాలని నిర్ణయించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. మొత్తానికి.. ఓటర్ల తొలగింపు వివాదం తెలంగాణలో మరో పెద్ద రాజకీయ తుఫానుకు తెరలేపింది. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పోరాటం మొదలుపెట్టింది.








