హెచ్-1బీ వీసా మరింత కఠినతరం..! ట్రంప్ కీలక చర్యలు..!
అమెరికాలో విదేశీయులకు జారీచేసే ఉద్యోగ వీసాల కార్యక్రమం మరింత కఠినతరం కానుంది. దీనికి సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హెచ్-1బీ వంటి వీసాలపై పర్యవేక్షణను తీవ్రతరం చేస్తూ ఈ వారంలోనే కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామంతో విదేశీ ఉద్యోగులలో, వారిపై ఆధారపడిన కంపెనీలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే, ఏయే వీసా కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకుంటున్నారో, ఏ కంపెనీలపై చర్యలు ఉంటాయో? లేదా ఎలాంటి దర్యాప్తులు చేపట్టనున్నారో? ఆయన తన పోస్ట్‌లో స్పష్టంగా వెల్లడించలేదు. ఈ ప్రకటన రాబోయే చర్యల తీవ్రతను సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది ట్రంప్ ప్రభుత్వం కొంతకాలంగా అనుసరిస్తున్న విస్తృత విధానంలో భాగమే. ఉపాధి ఆధారిత వలస విధానాలను కఠినతరం చేయడంపై, ముఖ్యంగా హెచ్-1బీ వీసా కార్యక్రమంపై, ట్రంప్ సర్కార్ మొదటి నుంచి దృష్టి సారించింది. సెప్టెంబర్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక కార్యనిర్వాహక ఉత్తర్వుపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) సంతకం చేశారు.
దీని ప్రకారం హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు.. అదే విధమైన నైపుణ్యాలు కలిగిన అమెరికన్ ఉద్యోగులను ఇటీవల తొలగించాయా లేదా తొలగించే ప్రణాళికలో ఉన్నాయా అనే విషయాన్ని సంబంధిత ఏజెన్సీలు తప్పనిసరిగా సమీక్షించాలని ఆదేశించారు.
దీనికి అనుబంధంగా, అమెరికా వెలుపల ఉన్న కార్మికులకు సంబంధించిన కొన్ని ప్రత్యేక హెచ్-1బీ పిటిషన్లపై విధించే లక్ష డాలర్ల ఫీజు ఆవశ్యకతను 2027 సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ మరో ప్రకటన జారీ చేశారు. ఈ చర్యల ద్వారా వీసా ప్రక్రియను మరింత నియంత్రించి, అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కూడా ఇదే తరహా అభిప్రాయాలను బలంగా వినిపిస్తున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా విఫలమైనదిగా అభివర్ణించారు. కొన్ని కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికులను నియమించుకోవడానికి ఈ వీసాలను ఒక సాధనంగా వాడుకుంటున్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు.








