జీవాయుధ ప్రయోగాల రేసులో అగ్రరాజ్యాలు…! ప్రపంచం ఆందోళన…!
ప్రపంచం ముంగిట అణుప్రమాదమే కాదు..జీవాయుధ ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నాళ్లుగా అమెరికా, రష్యా దేశాలు .. జీవాయుధాలు తయారు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అయితే ఆ రెండు దేశాలు వాటిని తోసిపుచ్చుతూ ముందుకెళ్తున్నాయి. లేటెస్టుగా రష్యాలోని ఓ ల్యాబ్ నుంచి ప్లేగు వ్యాధి బ్యాక్టీరియా లీక్ అయినట్లు వస్తోన్న కథనాలు కలవరపెడుతున్నాయి. ఆ ల్యాబ్‌లో ఏం జరుగుతోంది..? ఇది ప్రమాదమా లేక జీవాయుధాలపై ప్రయోగమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్లేగు (Plague) బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ ఇటీవల పగిలి ఆ వైరస్ లీక్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. మంగోలియా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ ల్యాబ్‌ను సోవియెట్ యూనియన్ కాలంలో నిర్మించారు. అంటువ్యాధి కారకాలను అధ్యయనం చేయడానికి అప్పట్లో దీన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఆసియా, సైబీరియా ప్రాంతాల్లోని జంతువుల నుంచి వేరు చేసిన ప్లేగు, ఆంథ్రాక్స్ వంటి వ్యాధి కారకాలను, వాటి ప్రమాదకర వేరియంట్లను ఇక్కడ నిల్వ చేశారు. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా ఈ ల్యాబ్‌లు పనిచేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ.. సోవియెట్ యూనియన్ కాలం నుంచే ఇక్కడ జీవాయుధ కార్యక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలున్నాయి. అప్పట్లో సోవియెట్ ఆర్మీ బయోవెపన్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు ఈ ల్యాబ్ నమూనాలను అందించినట్లు గతంలో పలు అధ్యయనాలు వెలువడ్డాయి.
సోనియెట్ కాలంలో ఇలాంటివి దాదాపు 80 ల్యాబ్‌లను నిర్మించారు. ఇవన్నీ వేలాదిగా వ్యాధి కారకాలు, వాటి వేరియంట్లను సేకరించి భద్రపర్చాయి. అయితే, 1991లో సోవియెట్ యూనియన్ కూలిపోయిన తర్వాత.. ఈ ల్యాబ్‌లకు నిధుల కొరత ఏర్పడింది. మరమ్మతులు కూడా చేయించలేని స్థితికి దిగజారాయి. ఆ సమయంలో అమెరికా మద్దతున్న కొన్ని సంస్థలు ముందుకొచ్చి ఈ ల్యాబ్‌లను బాగుచేయించాయి. వ్యాధికారకాలు బయటకు లీక్ కాకుండా అడ్డుకోగలిగాయి.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఈ జీవాయుధాల అంశం తెరపైకి వచ్చింది. అమెరికా మద్దతుతో కీవ్ బయోవెపన్స్ లాబొరేటరీలను నిర్వహిస్తోందని నాడు మాస్కో ఆరోపించింది. అయితే, వాటిని అమెరికా ఖండించింది. రష్యా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని, వాస్తవానికి ఆ దేశమే జీవాయుధాలపై ప్రయోగాలు చేపట్టిందని ఆరోపించింది. ఇందుకు సంబంధించి 2025 ఏప్రిల్‌లో అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక కూడా విడుదల చేసింది.
తాజాగా సైబీరియా ల్యాబ్ నుంచి ప్లేగు బ్యాక్టీరియా లీకైన నేపథ్యంలో అమెరికా సీఐఏ మాజీ డైరెక్టర్ మైక్ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నేళ్ల కిందట చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో కొవిడ్-19 వైరస్ లీకై ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు రష్యా నుంచి ప్లేగు బ్యాక్టీరియా లీక్‌ను కూడా చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాలి’’ అని పేర్కొన్నారు.
ప్లేగు.. అత్యంత భయానకం
ఈ ప్లేగు బ్యాక్టీరియా చిన్న చిన్న కీటకాల నుంచి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. ప్లేగు వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపరల నుంచి ఇతరులకూ వ్యాపిస్తుంది. 14వ శతాబ్దంలో ఈ వ్యాధి కారణంగా ఐరోపాలో 60శాతం జనాభా మరణించినట్లు పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
తాజాగా సైబీరియా ల్యాబ్‌లో ఓ టెస్ట్ ట్యూబ్ పగిలి ఈ బ్యాక్టీరియా బయటకు లీకైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాత అక్కడ పనిచేసే 28 ఏళ్ల షిపిలోవా అనే మహిళా ల్యాబ్ టెక్నీషియన్ మరణించడం మరింత భయాందోళనలకు దారితీసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు, సిబ్బందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. తాజా పరిణామాలపై అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఈ ఘటనపై రష్యా అన్ని వివరాలను బహిర్గతం చేస్తే.. ఆ దేశానికి అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు.








