అమెరికా సంచలనం.. మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం పొందిన 40 మందిపై వేటు!
అమెరికా ప్రభుత్వం వలసదారుల విషయంలో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంటోంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, తప్పుడు పద్ధతులు, అక్రమ మార్గాల ద్వారా అమెరికా పౌరసత్వాన్ని సంపాదించుకున్న 40 మంది వ్యక్తుల పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(న్యాయ శాఖ) చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. అసలు విషయాలను దాచిపెట్టి, తప్పుడు సమాచారంతో సిటిజెన్షిప్ పొందిన వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రెట్ ఎ.షూమేట్ స్పష్టం చేశారు. ఈ జాబితాలో చైనా, పాకిస్తాన్, మెక్సికో, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను ఎదుర్కొంటున్న 40 మంది జాబితాలో కాలిఫోర్నియాకు చెందిన బల్విందర్ సింగ్ అనే భారతీయ సంతతి వ్యక్తి ఉన్నాడు. ఈయన 1992లో బల్విందర్ సింగ్ పేరుతో యుఎస్ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తును సమర్పించగా, ఆ తర్వాత 2003లో మరో నకిలీ గుర్తింపు (ఫేక్ ఐడెంటిటీ) ఆధారంగా గ్రీన్ కార్డ్‌ను పొందాడు. ఆ రెండో ఐడెంటిటీని ఉపయోగించుకునే 2009లో అమెరికన్ పౌరసత్వాన్ని కూడా దక్కించుకున్నాడు. అయితే, వేలిముద్రలను విశ్లేషించి నిర్వహించిన దర్యాప్తులో ఈ రెండు దరఖాస్తులు ఒకే వ్యక్తికి చెందినవని అధికారులు స్పష్టంగా నిరూపించారు. నైతిక ప్రవర్తనను దెబ్బతీసే విధంగా మోసాలకు పాల్పడిన కారణంగా ఇతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు.
తీవ్రమైన నేరాలు…
కేవలం గుర్తింపునకు సంబంధించిన మోసాలే కాకుండా, దేశ భద్రతకే పెను ముప్పుగా పరిణమించిన నేరగాళ్లపై కూడా ఈ పౌరసత్వ రద్దు వేటు పడింది. ఇందులో చైనాలో జన్మించి అమెరికన్ నేవీలో సైనికుడిగా పనిచేసిన జిన్చావో వేయ్ కూడా ఉన్నాడు. అతను తనకున్న మిలిటరీ హోదాను అడ్డం పెట్టుకుని కీలకమైన సైనిక రహస్యాలను బీజింగ్ ప్రభుత్వానికి విక్రయించేందుకు కుట్ర పన్ని అడ్డంగా దొరికిపోయాడు. గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడినందుకు అతనికి ఇప్పటికే 200 నెలల జైలు శిక్ష విధించగా, తాజాగా అతని అమెరికన్ పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తున్నారు. వీరితో పాటు దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారు, విదేశీ ప్రభుత్వాలకు రహస్య ఏజెంట్లుగా వ్యవహరించిన వారు, హత్య కేసులలో నిందితులుగా ఉన్న తీవ్ర నేరస్థులను సైతం ఈ రద్దు జాబితాలో చేర్చారు.
మోసగాళ్లకు మరింత గడ్డుకాలం
వలస చట్టాల ప్రకారం అక్రమ మార్గాల్లో లేదా నిబంధనలను ఉల్లంఘించి పొందిన పౌరసత్వాన్ని వెనక్కి తీసుకునే పూర్తి అధికారం అమెరికా ప్రభుత్వానికి ఉంటుంది. దేశ పౌరసత్వ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని పూర్తిగా పునరుద్ధరించడమే తమ ప్రధాన లక్ష్యమని న్యాయ శాఖ తేల్చిచెప్పింది. మోసపూరిత మార్గాలను ఆశ్రయించి పౌరసత్వాలు పొందిన వారిపై ఈ తరహా కఠిన చర్యలు భవిష్యత్తులోనూ ఎప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతాయని జస్టిస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది.








