తిరువూరు, దెందులూరుపై టీడీపీ అధిష్టానం ఫోకస్..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించే నేతలపై తెలుగుదేశం పార్టీ(TDP) అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తోంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు, అలాగే టోల్‌ప్లాజా వద్ద జరిగిన వివాదాస్పద ఘటనపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేరుగా రంగంలోకి దిగారు. వివాదానికి కారణమైన స్థానిక నేతలతో పాటు, ఈ ఘటనతో సంబంధమున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పిలిపించి పల్లా శ్రీనివాసరావు సుదీర్ఘంగా వివరణ తీసుకున్నారు.
ఈ వివాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరించిన పల్లా శ్రీనివాసరావు, కేవలం నేతల మాటలనే కాకుండా క్షేత్రస్థాయి ఆధారాలను కూడా పరిశీలించారు. టోల్‌ప్లాజా వద్ద అసలేం జరిగిందనే కోణంలో అక్కడి సిబ్బందితో పాటు, లారీ డ్రైవర్ల నుంచి సేకరించిన వివరణలను, నివేదికలను ఆయన క్షుణ్ణంగా పరిగణనలోకి తీసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో నేతల ప్రవర్తన ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు నేతలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నాయకులు ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలకు పూర్తిగా దూరంగా ఉండాలని, పార్టీ క్రమశిక్షణ గీత దాటితే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో కేడర్‌ను గందరగోళానికి గురిచేయకుండా, పార్టీ ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత సీనియర్లపైనే ఉందని గుర్తు చేశారు. అధిష్టానం పిలుపుతో ప్రస్తుతానికి తిరువూరు సీన్ సర్దుమణిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, అంతర్గత కుమ్ములాటలపై బాబు మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








