Green Card Applicants కు భారీ షాక్..! ట్రంప్ నిర్ణయంతో మారిన పరిస్థితులు!
అమెరికాలో స్థిరపడాలని, గ్రీన్ కార్డ్ సాధించి అక్కడ శాశ్వత నివాస హక్కు పొందవచ్చని ఆశపడుతున్న లక్షలాది మంది వలసదారులకు ఒక్కసారిగా పెద్ద ఊహించని షాక్ తగిలింది. దశాబ్దాలుగా ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దిన ప్రక్రియను హఠాత్తుగా కష్టతరం చేస్తూ ట్రంప్-వాన్స్ ప్రభుత్వం రెండు కొత్త రూల్స్ తెచ్చింది.
ఇప్పటికే అమెరికాలో ఉంటూ, తమ ఉద్యోగాలు, చదువులు చూసుకుంటూ చట్టబద్ధంగా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఈ కొత్త నియమాలు అర్హులైన వారికి కూడా తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయంటూ పలు సంస్థలు బోస్టన్ కోర్టు తలుపు తట్టాయి.
సమస్యకు మూలం: ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’ విధానం
సాధారణంగా అమెరికాలో ఉన్న వలసదారులు తమ కుటుంబాలను, ఉద్యోగాలను, చదువులను వదిలిపెట్టి మళ్లీ సొంత దేశాలకు వెళ్లకుండానే అక్కడి నుంచే గ్రీన్ కార్డ్ పొందేందుకు ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’ అనే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. కానీ, మే 2026లో అమల్లోకి తెచ్చిన కొత్త విధానం ప్రకారం.. అమెరికాలో ఉండి గ్రీన్ కార్డ్ అడగడాన్ని USCIS అధికారులు ఒక మైనస్ పాయింట్‌గా పరిగణించే అవకాశం ఏర్పడింది.
అంటే, దేశం దాటకుండా ఇక్కడే ఉండి అడగడమే పెద్ద తప్పు అన్నట్లుగా చూస్తారు. ఈ నెగెటివ్ మార్కును అధిగమించి గ్రీన్ కార్డ్ సాధించాలంటే దరఖాస్తుదారులు ఏదో ‘అసాధారణమైన లేక అత్యంత ప్రత్యేకమైన’ పరిస్థితి తమకు ఉందని నిరూపించుకోవాల్సి వస్తోంది. ఇది చాలామందికి అసాధ్యమైన విషయంగా మారింది.
రెండో దెబ్బ: దరఖాస్తుల ఆటోమేటిక్ తిరస్కరణ!
అది చాలదన్నట్లు, ఆగస్టు 2026లో సర్కార్ మరో కఠిన నిబంధనను తెరపైకి తెచ్చింది. సాధారణంగా దరఖాస్తులో ఏవైనా వివరాలు తగ్గితే USCIS అధికారులు అదనపు ఆధారాలు సమర్పించమని కోరతారు.
కానీ ఈ కొత్త రూల్ ప్రకారం.. ఆ అవకాశం కూడా ఇవ్వకుండానే అధికారులకు నచ్చకపోతే నేరుగా అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసే వెసులుబాటు కల్పించారు. పైగా, ఈ నిబంధనలు అమల్లోకి రాకముందు గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకుని క్యూలో ఉన్న లక్షలాది మందిపైనా ఈ ప్రభావం పడటం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.
ఇవి కూడా చదవండి
కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం
ఈ దెబ్బతో అమెరికాలో దశాబ్దాలుగా కష్టపడి స్థిరపడిన కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. భార్యాభర్తలు, తల్లిదండ్రులు-పిల్లలు విడిపోవాల్సి రావడం లేదా అందరూ కలిసి దేశం విడిచి వచ్చేయాల్సి రావడం లాంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడవచ్చు.
అలాగే అక్కడ పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు అంతా తమ కెరీర్‌ను మధ్యలోనే వదిలేసుకోవాల్సిన అనిశ్చితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించాల్సిన అమెరికా, ఇలాంటి కఠిన నిబంధనలతో ఆ నిపుణులనే బయటకు నెట్టేస్తోందని పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టులో పోరాటం & భారతీయులపై ప్రభావం
ఈ అన్యాయమైన రూల్స్‌ను వెంటనే నిలిపివేసి, వాటిని పూర్తిగా రద్దు చేయాలని కోర్టులో దాఖలైన పిటిషన్ స్పష్టం చేస్తోంది. అభ్యర్థుల గ్రీన్ కార్డ్ దరఖాస్తులను పాత పద్ధతిలోనే, పాత ప్రమాణాల ప్రకారమే పరిశీలించేలా USCISను ఆదేశించాలని అర్జించారు.
ఈ పోరాటం ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, నిపుణులకు అత్యంత కీలకంగా మారింది. కేసు కు సంబదించిన కాగితాల్లో నేరుగా భారతదేశం పేరు ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, అమెరికాలోని గ్రీన్ కార్డ్ క్యూలో అత్యధికంగా ఉన్నది భారతీయులే కాబట్టి ఈ నిర్ణయం ప్రభావం మనవారిపైనే అత్యధికంగా ఉండబోతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








