నాడీ కణజాలాల పనితీరుపై పరిశోధనలకు నోబెల్…
మెదడు పనితీరు, అంతుచిక్కని అంశాల అధ్యయనానికి సంబంధించి కీలక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల త్రయం కార్ల్ డైసరోథ్, పీటర్ హెగెమన్, జార్జ్ నగెల్లను ఈ ఏడాదికి వైద్య శాస్త్రంలో ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. నాడీ కణాల్లో పనిని ప్రారంభించేందుకు లేదా ఆపేసేందుకు మెదడు ఉపయోగించే యంత్రాంగాలను
మరింత లోతుగా విశ్లేషించేందుకు వీరు కృషి చేస్తున్నారు. అమెరికాకు చెందిన డైసరోథ్ (54) ప్రస్తుతం కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. హెగెమన్ (71), నగెల్ (73) జర్మనీ పౌరులు. హెగెమన్ హంబోల్ట్ యూనివర్సిటీలో, నగెల్ వుర్జ్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. మెదడుకు సంబంధించిన మిస్టరీలను ఛేదించేందుకు ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలను ప్రపంచవ్యాప్తంగా పనియోగించుకుంటున్నారని నోబెల్ అసెంబ్లీ ప్రశంసించింది.
న్యూరోసైన్స్‌లో నవ శకం
ఆప్టోజెనెటిక్స్, లైట్-గేటెడ్ అయాన్ ఛానల్స్‌పై డైసరోథ్, హెగెమన్, నగెల్ విస్తృత పరిశోధనలు చేశారు. ఆప్టోజెనెటిక్స్ అనేది విప్లవాత్మక సాంకేతికత. ఇది దృశాశాస్త్రం, జన్యుశాస్త్రాల సమ్మిళితం. నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలతో కూడిన కాంతి ప్రసరించినప్పుడు కణ త్వచాల్లో తెరుచుకునే మైక్రోస్కోపిక్ ప్రొటీన్ డోర్లను లైట్-గేటెడ్ అయాన్ ఛానల్స్ అంటారు. నాడీ కణాలు, మెదడులోని సర్క్యూట్లను కాంతితో నియంత్రించగలిగే విధానాన్ని కనుగొనడం న్యూరోసైన్స్‌లో నవ శకానికి దారితీసినట్లు నోబెల్ అసెంబ్లీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
నాచుపై పరిశోధనతో..
ఏక కణ రకానికి చెందిన గ్రీన్ ఆల్గే (ఆకుపచ్చ నాచు) కాంతి వైపు ఎలా ఈదగలుగుతోందో తెలుసుకునేందుకు హెగెమన్ తొలుత పరిశోధన చేపట్టారు. నీలి కాంతితో ప్రకాశింపజేసినప్పుడు.. కణాల్లో విద్యుత్ ప్రచోదనాన్ని(ఎలక్ట్రికల్ ఇంపల్స్) సృష్టించేందుకు ఛానల్‌ను తెరుస్తున్న ఓ ప్రొటీన్‌ను నగెల్తో కలిసి ఆయన కనుగొన్నారు. ఆ ప్రొటీన్‌ను ఇతర కణాల్లో ప్రవేశపెట్టినప్పుడు అవి కూడా నిర్దిష్ట కాంతి ప్రభావానికి లోనవుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆ ప్రొటీన్‌ను నియంత్రించే జన్యువుపై డైసరోథ్ పరిశోధనలు చేపట్టారు. ఎలుకల మెదడులో కాంతితో నియంత్రించే స్విచ్ (లైట్ సెన్సిటివ్ ప్రొటీన్)ను సృష్టించారు.
స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ పురస్కారాలను ప్రకటించింది. ఈ బహుమతి కింద దక్కే 12 లక్షల డాలర్ల (దాదాపు రూ.11.55 కోట్లు)ను ముగ్గురు పంచుకోనున్నారు.








