విదేశాల్లో పీహెచ్ డీ చేయాలా..? కెనడా బంపరాఫర్..!
విదేశాల్లో పీహెచ్ డీ చేసి, మంచి ఉద్యోగాల్లో సెటిలవ్వాలనుకుంటున్నవారికి కెనడా బంపరాఫర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన పీహెచ్డీ విద్యార్థులను ఆకర్షించేందుకు 100 మిలియన్ల డాలర్లతో (దాదాపు రూ.956 కోట్ల) కొత్త స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది టొరంటో విశ్వవిద్యాలయం.ప్రతిభావంతులైన పీహెచ్డీ విద్యార్థులను కెనడాకు ఆకర్షించడంతో పాటు, అమెరికా నుంచి బయటకు వెళ్లే విద్యార్థులకు గమ్యం కావాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
‘ప్రెసిడెంట్స్ ఇంపాక్ట్ స్కాలర్షిప్స్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి 80 వేల కెనడియన్ డాలర్లు అందిస్తారు. నాలుగేళ్లలో మొత్తం 3.2 లక్షల డాలర్లు లభిస్తాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3.08 కోట్లు.
ఈ స్కాలర్షిప్ కింద ఎంపికైన విద్యార్థులు ఇద్దరు అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధన చేయనున్నారు. విభిన్న రంగాలను కలిపి పరిశోధనలు చేసేలా వారికి అవకాశం కల్పించనున్నారు. సంక్లిష్టమైన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే పరిశోధనలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని విశ్వవిద్యాలయం తెలిపింది.ఈ పథకం కోసం కెనడాకు చెందిన ఓ ఫ్యామిలీ ఫౌండేషన్ 50 మిలియన్ డాలర్ల విరాళం అందించింది. విశ్వవిద్యాలయం కూడా అంతే మొత్తాన్ని జోడించింది. దీంతో మొత్తం నిధి 100 మిలియన్ డాలర్లకు చేరింది.
ఇవి కూడా చదవండి
2027 సెప్టెంబర్ నుంచి ప్రతి ఏడాది 12 లేదా 13 మంది కొత్త విద్యార్థులకు నాలుగేళ్లపాటు స్కాలర్షిప్ అందించనున్నారు. నాలుగో ఏడాది నాటికి మొత్తం 50 మంది స్కాలర్లకు ఈ ప్రయోజనం అందుతుంది. ఆ తర్వాత కూడా 50 మంది విద్యార్థులకు ఈ నిధులు నిరంతరం అందేలా కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.
కెనడాలోని ప్రముఖ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో టొరంటో విశ్వవిద్యాలయం ఒకటి. 2027 క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో ఇది 32వ స్థానంలో నిలిచింది.








