చంద్రుడిపైనా అణువిద్యుత్.. రియాక్టర్ ఏర్పాటుకు అగ్రరాజ్యాల ప్రయత్నాలు..
భూమి తర్వాత మానవ ఆవాసానికి కాస్తైనా అనువైన స్థలం ఎక్కడైన ఉందా అంటే అది చంద్రుడు అని చెప్పొచ్చు. అందుకే ప్రపంచదేశాలు చంద్రుడిపై ఎప్పుడెప్పుడు ఆవాసాలు ఏర్పాటు చేద్దామని అని ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అయితే అది అంత సులభం కాదు .. ఎందుకంటే చంద్రుడిపై రాత్రి సమయం కొన్ని వారాల పాటు ఉంటుంది. అందువల్ల ఎక్కువ విద్యుత్ అవసరం. దీంతో సోలార్, ఇతరత్ర విద్యుత్ విధానాలు వర్కవుట్ కావు. అందుకే.. ఇప్పుడు అమెరికా, రష్యా,చైనా.. అణువిద్యుత్ తయారీపై ఫోకస్ పెట్టాయి.
అమెరికా, చైనా, రష్యా ఇప్పుడు చంద్రుడిపై అణు రియాక్టర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. భవిష్యత్తులో చంద్రుడిపై ఎక్కువ కాలం మనుషులు ఉండాలన్నా, అక్కడి వనరులను అన్వేషించాలన్నా విద్యుత్ కీలకం. అందుకే ఈ మూడు దేశాలు అణుశక్తిని ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి.
ఓ చిన్న అణు రియాక్టర్ తయారీకి కంపెనీల నుంచి ఆగస్టులో నాసా ప్రతిపాదనలు కోరినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో పనిచేసేలా దీన్ని రూపొందించనున్నారు. 2030 డిసెంబరు నాటికి ప్రయోగానికి సిద్ధం చేయాలన్నది లక్ష్యం. ఈ రియాక్టర్ 20 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఐదేళ్ల పాటు మానవ జోక్యం లేకుండా పనిచేసేలా రూపొందించాలని భావిస్తున్నారు.
చైనా కూడా చంద్రుడిపై అణుశక్తిని ఉపయోగించే ప్రణాళికలతో ముందుకెళ్తోంది. చైనాతో కలిసి రష్యా ‘సెలీనా’ పేరుతో రియాక్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. 2036 నాటికి దీన్ని సిద్ధం చేయాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 10 కిలోవాట్ల వరకు విద్యుత్ అందిస్తూ పదేళ్ల పాటు సొంతంగా పనిచేసేలా రూపొందించనున్నారు.
ఇవి కూడా చదవండి
చంద్రుడిపై ఒక రాత్రి రెండు వారాలకు పైగా ఉంటుంది. దీంతో సౌర విద్యుత్‌పై పూర్తిగా ఆధారపడటం కష్టం. ప్రారంభ దశలో అమెరికా, చైనా సౌర విద్యుత్, రేడియోఐసోటోప్ వ్యవస్థలను ఉపయోగించాలనుకుంటున్నాయి. అయితే పెద్ద స్థావరాలు ఏర్పడితే ఎక్కువ విద్యుత్ అవసరమవుతుంది. అక్కడే అణు రియాక్టర్లు కీలకంగా మారనున్నాయి.
చంద్రుడిపై అణు రియాక్టర్ ఏర్పాటు అంత సులభం కాదు. రాకెట్ ప్రయోగం విఫలమైతే అణు పదార్థాల విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. చంద్రుడిపై రియాక్టర్‌ను భద్రపరచడం, నిర్వహించడం కూడా కష్టమే. వ్యోమగాములు, పరికరాల భద్రత కోసం రియాక్టర్ చుట్టూ కొన్ని ప్రాంతాలను పరిమితం చేయాల్సి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, రష్యా మాత్రం ప్రయోగ సమయంలో రియాక్టర్లను క్రియాశీలం చేయకుండా తీసుకెళ్లాలని భావిస్తున్నాయి.
చంద్రుడిపై ఎవరిది హక్కు?
1967లో కుదిరిన ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఏ దేశమూ చంద్రుడిని తన భూభాగంగా ప్రకటించుకోకూడదు. అయితే భవిష్యత్తులో స్థావరాల చుట్టూ ఇతర దేశాల ప్రవేశాన్ని పరిమితం చేయవచ్చా? చంద్రుడి నుంచి తీసే వనరులపై హక్కులు ఎవరికి ఉంటాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాంకేతిక, భద్రతా సవాళ్ల కారణంగా మూడు దేశాల ప్రస్తుత గడువులు మారే అవకాశం కూడా ఉంది.








