ఏపీకి రూ.30,156 కోట్ల భారీ వాటర్ ప్రాజెక్ట్.. చంద్రబాబు, పవన్ చేతుల మీదుగా శ్రీకారం!
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసం, తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా రేపు ఈ చారిత్రాత్మక పర్యటనలో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జాతీయ ‘జల్ జీవన్ మిషన్’, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘అమరజీవి జలధార’ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన కుళాయి తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇందుకోసం కూటమి ప్రభుత్వం ఏకంగా రూ. 30,156 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ మెగా వాటర్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అదనంగా 27.36 లక్షల కొత్త ఇంటింటి కుళాయి కనెక్షన్లను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రేపటి అధికారిక పర్యటన షెడ్యూల్ ప్రకారం.. ప్రొద్దుటూరు చేరుకున్న అనంతరం ఉదయం 11.20 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ జల్ జీవన్ మిషన్ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించి, పనులకు అధికారికంగా శంకుస్థాపన చేస్తారు.
ఇవి కూడా చదవండి
పైలాన్ ఆవిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఇద్దరు నేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామీణాభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా ప్రణాళికలను ఈ వేదిక ద్వారా ప్రజలకు వివరించనున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో సీఎం, డిప్యూటీ సీఎంలు కలిసి పర్యటిస్తుండటంతో రాజకీయంగానూ ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.








