ఈ దంపతులకు సాటి రారెవ్వరు… యూసీఎస్ఎఫ్కు డా.అంబటి, రమ రూ.10 కోట్ల భారీ విరాళం
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో(యూసీఎస్ఎఫ్)కు తెలుగు సంతతికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, రమ అంబటి దంపతులు తమ ఉదారతను చాటుకున్నారు. సాన్ జోవాక్విన్ లోయలో వైద్య విద్య, పరిశోధనా రంగాలు శాశ్వతంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో వారు ఏకంగా 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.10 కోట్లు) విలువైన ఎండోమెంట్(శాశ్వత నిధి) విరాళాన్ని ప్రకటించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెస్నో పట్టణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విరాళానికి సంబంధించిన పత్రాలను యూనివర్సిటీ అధికారులకు అందజేశారు.
శాశ్వత నిధి…
సాధారణ గ్రాంట్లు లేదా విరాళాల మాదిరిగా కాకుండా, ఎండోమెంట్ నిధులు ఎప్పటికీ అయిపోవు. ఒక మిలియన్ డాలర్ల మొత్తాన్ని యూనివర్సిటీ సురక్షితమైన పెట్టుబడిగా మారుస్తుంది. ఆ పెట్టుబడి ద్వారా వచ్చే వార్షిక వడ్డీ లేదా ఆదాయాన్ని మాత్రమే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. ఈ నిధి ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అత్యుత్తమ ప్రతిభావంతులైన వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందజేస్తారు. ముఖ్యంగా గ్రామీణ వైద్యం, కుటుంబ వైద్యం (ఫ్యామిలీ మెడిసిన్), అల్ట్రాసౌండ్ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో వినూత్న పరిశోధనలు చేయడానికి ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా భావితరాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
యూనివర్సిటీ చరిత్రలో చారిత్రక మైలురాయి..
అంబటి దంపతుల ఈ అద్భుతమైన దాతృత్వంపై యూసీఎస్ఎఫ్ డీన్ డాక్టర్ జోస్ ఎమ్ భారల్ సాంచేజ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది యూనివర్సిటీ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని, చిరకాలం గుర్తుండిపోయే మైలురాయి అని కొనియాడారు. డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వైద్య నిపుణులు, పరిశోధకులు కాగా, ఆయన సతీమణి రమ అంబటి వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ దంపతుల దాతృత్వ గుణం రాబోయే తరాలకు గొప్ప మార్గదర్శకం అని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి
అమెరికా రుణం తీర్చుకుంటున్నాం..
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి మాట్లాడుతూ… తాము పుట్టి పెరిగిన భారత్తో పాటు, తమకు అన్నివిధాలా ఉపాధినిచ్చి స్థిరపడేలా చేసిన అమెరికా దేశం.. ఈ రెండింటి రుణం తీర్చుకోవడంలో భాగంగానే ఈ విరాళం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. 1986 నుంచి తాను యూసీఎస్ఎఫ్లో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నానని, తమ కుటుంబం అమెరికాలో గత 40 ఏళ్లుగా నివసిస్తోందని గుర్తుచేసుకున్నారు. ఈ యూనివర్సిటీనే తనకు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని, వైద్యుడిగా ఎదిగేందుకు పూర్తి అవకాశం కల్పించిందని తెలిపారు. తన సతీమణి రమ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాము సంపాదించుకున్న దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి తిరిగివ్వాలనే ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ శాశ్వత నిధి ద్వారా ఎంతోమంది ఆర్థిక పేదరికం ఉన్న విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను అభ్యసించి, భవిష్యత్లో సమాజానికి సేవ చేసే గొప్ప వైద్యులుగా తయారవుతారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అమెరికాలోని అత్యున్నత పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) వైద్య, ఆరోగ్య శాస్త్రాల రంగంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా వెలుగొందుతోంది. బయోమెడికల్ సైన్సెస్, క్లినికల్ మెడిసిన్లో ఈ విశ్వవిద్యాలయానికి సాటిలేని పేరుంది.
అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నుంచి అత్యధిక స్థాయిలో పరిశోధనా నిధులు అందుకునే అగ్రగామి సంస్థల్లో ఇది ఒకటి. క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతలు (న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు), మెదడుకు సంబంధించిన అంశాలు, స్టెమ్ సెల్ పరిశోధనల్లో అద్భుత ఆవిష్కరణలు చేసిన ఏడుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు ఈ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా, పరిశోధకులుగా సేవలందించడం విశేషం. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు తెలుగు తేజం డాక్టర్ అంబటి దంపతులు ఈ స్థాయిలో విరాళం అందించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.









