ఎమ్మెల్సీగా కొండా లక్ష్మణ్ బాపూజీ వారసురాలు!?
తెలంగాణలో నామినేటెడ్ పదవుల చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా నవంబర్‌లో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ తొలి ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె కె.పవిత్రవాణి పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం డాక్టర్ గా సేవలందిస్తున్న ఆమెను శాసనమండలికి పంపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహరిస్తోంది.
త్వరలో ఖాళీ కానున్న మూడు స్థానాల్లో ఒక సీటును పద్మశాలి సామాజిక వర్గానికి కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అందుకు అనుగుణంగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులపై కాంగ్రెస్ పార్టీ ఆరా తీస్తోంది. తెలంగాణ ఉద్యమ కారులకు, వాళ్ల కుటుంబాలకు చెందిన వారికి ప్రధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. బీసీ వర్గాల్లో, ముఖ్యంగా పద్మశాలి సామాజిక వర్గంలో పట్టు సాధించడంతో పాటు, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గౌరవించామనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కొండా లక్ష్మణ్ బాపూజీ మరణానంతరం ఆయన భౌతికకాయాన్ని కూడా కామారెడ్డిలోని పద్మశాలి భవన్‌లోనే ఉంచడం, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పార్టీ తరఫున తరచూ గుర్తుచేస్తోంది. ఇప్పుడు ఆయన కుమార్తెకు పదవి ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి సముచిత గౌరవం ఇచ్చినట్లవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇవి కూడా చదవండి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందంటూ పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విమర్శలకు తగ్గట్టుగానే ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా చేయడం.., వివిధ కార్పొరేషన్లలో ఉద్యమకారులకు పదవులివ్వడం.., శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలికి మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా అవకాశాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవిత్రవాణి పేరు తెరపైకి వచ్చింది. దీని వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అయితే.. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఇతర సీనియర్ నేతలు, ఉద్యమ నేపథ్యం ఉన్న సమర్థులు సైతం తమ వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. గవర్నర్ కోటా కింద ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు నాంది పలకనుందో వేచి చూడాలి.








