టీటీడీలో జీడిపప్పు గోల.. అధికారుల సంచలన నిర్ణయం..!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Laddu) మరియు ఇతర ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిసరుకుల నాణ్యత విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల గోడౌన్‌కు చేరుకున్న భారీ మొత్తంలో నాణ్యత లేని జీడిపప్పు స్టాక్‌ను అధికారులు నిర్మొహమాటంగా తిరస్కరించి, వెనక్కి పంపించివేశారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి తిరుమల గోడౌన్‌కు 12 టన్నుల జీడిపప్పు సరఫరా అయింది.
అయితే, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే ప్రతి ముడిసరుకును ముందస్తుగా పరీక్షించాలనే నిబంధనల ప్రకారం.. టీటీడీ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌లో ఈ జీడిపప్పును నిపుణులు పరీక్షించారు. ఈ ల్యాబ్ పరీక్షల్లో సదరు జీడిపప్పు నిశ్చిత నాణ్యతా ప్రమాణాల ప్రకారం లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ 12 టన్నుల స్టాక్‌ను వెంటనే తిరస్కరించి, వచ్చిన వాహనాల్లోనే వెనక్కి పంపించివేశారు. గతంలో లడ్డూ ప్రసాదం నెయ్యి నాణ్యత మరియు ఇతర ముడిసరుకుల విషయంలో జరిగిన వివాదాల నేపథ్యంలో.. ప్రస్తుత టీటీడీ యాజమాన్యం శ్రీవారి ప్రసాదాల తయారీపై అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి
స్వామివారి లడ్డూ రుచి, శుచి మరియు నాణ్యత విషయంలో భక్తుల నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిరంతర తనిఖీలు మరియు కఠిన నిర్ణయాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరియు ఈఓ ముద్దాడ రవిచంద్ర స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముడిసరుకుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సప్లయర్లపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.








