అమరావతి, వైజాగ్‌లో సినీ పరిశ్రమకు కొత్త ఊపు.. మురళీమోహన్ కీలక ప్రతిపాదన!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు విశాఖపట్నంతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్ తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక పరిధిలోని ఆత్మకూరు వద్ద ఉన్న ఓ రిసార్ట్‌లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దశాబ్ది వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు అంబటి మధుమోహనకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మురళీమోహన్ కీలక ప్రసంగం…
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. రాత్రికి రాత్రే వేలాది మంది కార్మికులు హైదరాబాద్ నుండి ఇక్కడకు రావడం సాధ్యం కాదని, గత 35 ఏళ్ల పాటు ఎంతో కష్టపడితేనే హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ ఓ స్థాయికి వచ్చిందని గుర్తుచేశారు. అందరం కలిసికట్టుగా ప్రయత్నించి సినిమా పరిశ్రమకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను క్రమంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ముందుగా అమరావతిలో అవసరమైన స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయిస్తే.. ఏసీ ఫ్లోర్లు నిర్మించుకుని ఇండోర్ షూటింగ్‌లు జరుపుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో అమరావతి రైతాంగం ప్రచండంగా కదిలి భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం మరో మూడుసార్లు అధికారంలోకి వస్తే అమరావతిని ప్రపంచస్థానికంగా అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుకోవచ్చని, అలాగే వైజాగ్ ప్రాంతం కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంతో బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రాజధానిని, సినీ పరిశ్రమను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మురళీమోహన్‌కు జీవిత సాఫల్య పురస్కారం…
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తించి మురళీమోహన్‌కు ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారం(Lifetime Achievement Award) అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల మృతి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. నటీనటులు, నిర్మాతలు జ్యోతి ప్రజలజన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఎన్నారై కోమటి జయరామ్, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ నిర్మాతలు ఏఎం రత్నం, కొణిదెల నిహారిక, సినిమా నటులు లయ, జోశర్మ, ఛాంబర్ ప్రధాన కార్యదర్శి మోహన్‌గౌడ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై జాతీయ ఉత్తమ తెలుగు చలనచిత్ర విజేతలు, షార్ట్ ఫిల్మ్ విజేతలు, సీనియర్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నటీనటులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందజేశారు.








