హైదరాబాద్ రవాణా ముఖచిత్రంలో భారీ మార్పులు!
మెట్రో నగరాలలో ట్రాఫిక్ రద్దీ పెద్ద సమస్యగా మారింది. నగరాల సుందరీకరణ, ప్రయాణ సౌలభ్యం కోసం ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అయితే.. క్షేత్రస్థాయి పరిస్థితులు, వ్యయ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కొన్ని ప్రాజెక్టులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపట్టాల్సిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రణాళికలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ పలు మార్పులు చేసింది.
గతంలో ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం, కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు రూ.1,090 కోట్ల వ్యయంతో ఏడు అండర్‌పాస్‌లు, ఏడు ఫ్లైఓవర్లను నిర్మించాలని నిర్ణయించారు. అయితే.. నగరంలో మారుతున్న ట్రాఫిక్ అవసరాలు, స్థానిక భౌగోళిక పరిస్థితులు, వ్యయ నియంత్రణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
కొత్త ప్రణాళికల ప్రకారం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముఫ్కంజా ఇంజనీరింగ్ కాలేజీ వరకు రూ.715.16 కోట్ల అంచనా వ్యయంతో సరికొత్త స్టీల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీనివల్ల గతంలో ప్రతిపాదించిన బంజారాహిల్స్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద 2-లేన్ సింగిల్ వే ఫ్లైఓవర్, టీవీ9 జంక్షన్ వద్ద అండర్‌పాస్‌లు వంటి అనేక పనులను రద్దు చేశారు. ఈ మార్పుల వల్ల గతంలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కు ఇచ్చిన కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌ను రద్దు చేశారు. అంతేకాక, ఆ ఏజెన్సీ చెల్లించిన డిపాజిట్లను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి
మొత్తం ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి పనులను వేగవంతం చేయాలని కమిటీ భావిస్తోంది. ప్యాకేజీ-1 పరిధిని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి ముగ్ధ జంక్షన్ వరకు స్టీల్ ఫ్లైఓవర్‌గా మార్చాలని నిర్ణయించారు. గతంలో రూ.580 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని సవరిస్తూ, రూ.365.85 కోట్లకు కుదించారు. అలాగే రోడ్డు నంబర్-45 జంక్షన్, ఫిలింనగర్ జంక్షన్ ప్రాంతాల్లోని పనుల ప్రణాళికను కూడా మార్చారు.
ప్యాకేజీ-2 కింద ముగ్ధ జంక్షన్ నుంచి ముఫ్కంజా కాలేజీ వరకు, బంజారాహిల్స్ రోడ్డు నంబర్-1కి అనుసంధానించే రాంపుతో కూడిన స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. రూ.510 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.349.31 కోట్లకు సవరించారు. ఈ రెండు ప్యాకేజీల నిర్మాణ పనులను ప్రస్తుతం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సంస్థకు అప్పగించాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.
కేవలం రవాణా రంగానికే కాకుండా, నగరంలోని ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కూడా స్టాండింగ్ కమిటీ పెద్దపీట వేసింది. ఆరాంఘర్ – జూపార్కు మార్గంలో 6-లేన్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి రూ.799.74 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించారు. అలాగే ఒవైసీ హాస్పిటల్, బహాదుర్పురా జంక్షన్ల వద్ద మల్టీలెవెల్ ఫ్లైఓవర్ల కోసం రూ.161 కోట్లు కేటాయించారు. మరోవైపు, జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థల ఆధునికీకరణ, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించారు. చింతల్ చెరువుకు రూ.20 కోట్లు, రాంపల్లి చెరువు అభివృద్ధికి రూ.40 కోట్లు మంజూరు చేయడం ద్వారా జలవనరుల పరిరక్షణకు పెద్దపీట వేసినట్టైంది.








