అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహిళ మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సుప్రియ అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం అలుముకుంది.
కుటుంబ నేపథ్యం..
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సింహాద్రినగర్ కాలనీకి చెందిన దారం శ్రీనివాసరావు, జ్యోతి దంపతుల కుమార్తె సుప్రియ. మహబూబాబాద్ పట్టణానికి చెందిన కొదుమూరి రంజిత్‌తో ఆమెకు వివాహం జరిగింది. రంజిత్ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, సుప్రియ అక్కడే స్వయంగా ఒక రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. వీరికి సాయి అద్వైత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
ప్రమాదం ఎలా జరిగిందంటే..
ఆదివారం తెల్లవారుజామున సుప్రియ రెస్టారెంట్‌ను మూసివేసి తన స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్ వీరి కారును అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో పాటు ఉన్న స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతదేహం తరలింపు..
విదేశాల్లో కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుప్రియ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వెంటనే సుప్రియ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సానుభూతి తెలిపారు.








