విజయనగరం జిల్లాలో ఖాళీ అవుతున్న వైసీపీ..!
విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో(YSRCP) రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలో నైతికంగా దెబ్బతిన్న పార్టీకి, ఇటీవల చిన్న శ్రీను రాజీనామా తర్వాత క్షేత్రస్థాయిలో వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానిక నాయకులు పార్టీని వీడుతుండటంతో విజయనగరంలో వైసీపీ దాదాపు ఖాళీ అవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో ఈ వలసలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
చీపురుపల్లి మండలం, దేవరకుదిరాం గ్రామంలో ఒకేసారి 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాయి. నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, క్షేత్రస్థాయిలో కేడర్‌ను పట్టించుకోకపోవడం వల్లే తాము పార్టీని వీడుతున్నట్లు వారు స్పష్టం చేశారు. మరోవైపు గరివిడి మండలంలోనూ వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఈ మండలం పరిధిలోని కొమురం పాలవలస, కోనూరు గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు ఏకకాలంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాయి.
ఇవి కూడా చదవండి
ఒకేరోజు రెండు మండలాల పరిధిలోనే 150 కుటుంబాలు పార్టీకి దూరం కావడం వైసీపీ శ్రేణులను తీవ్ర ఆందోళనలో పడేసింది. కేవలం సాధారణ కార్యకర్తలే కాకుండా, నిన్నమొన్నటి వరకు పార్టీని గ్రామాల్లో నడిపించిన మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇప్పటికే వైసీపీకి అధికారికంగా గుడ్ బై చెప్పేశారు. నియోజకవర్గ స్థాయి ముఠా తగాదాలు, భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రత్యామ్నాయ దారులను వెతుక్కుంటోంది. వరుసగా జరుగుతున్న ఈ వలసల కారణంగా విజయనగరం జిల్లాలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.








