డ్రోన్ల భరతం పట్టే లేజర్, మైక్రోవేవ్ సిస్టమ్స్.. అమెరికా కీలక నిర్ణయం..
యుద్ధక్షేత్రం తీరు తెన్నులు మారిపోయాయి. యుద్ధరీతుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.గతంలో దేశం పరిమాణం, ఆర్మీ స్ట్రెంత్, ఆయుధ వ్యవస్థలను బట్టి గెలుపోటములు ఉండేవి. అయితే ఇప్పుడు అవేవీ అక్కర్లేదు.. కేవలం కొద్దిపాటి వ్యయంతో కొన్ని డ్రోన్లు, మిస్సైల్స్ ఉంటే చాలు .. ఎంత పెద్దదేశంతో అయినా ఇట్టే యుద్ధం చేసేయొచ్చు..ముఖ్యంగా డ్రోన్లు అగ్రరాజ్యాలను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్ల ముప్పు ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నాలుగు అత్యాధునిక లేజర్, మైక్రోవేవ్ ఆయుధ వ్యవస్థలను పరీక్షించేందుకు ఎంపిక చేసింది. వీటిని అమెరికా రక్షణ శాఖ కార్యాచరణ పరీక్షల్లో ఉపయోగించనుంది.జాయింట్ ఇంటర్‌ఏజెన్సీ టాస్క్‌ఫోర్స్-401 ఈ పరీక్షలను నిర్వహించనుంది. అమెరికా భూభాగంలో చిన్న డ్రోన్ల ముప్పును ఎదుర్కొనే చర్యలను ఈ సంస్థ సమన్వయం చేస్తోంది.
ఎంపికైన వాటిలో ఏరోవైరాన్మెంట్కు చెందిన ‘ప్యాలటైజ్డ్ హై ఎనర్జీ లేజర్’, ‘ఎపిరస్ లియోనిడాస్ హై పవర్డ్ మైక్రోవేవ్’, ‘కోర్డ్ ఫైర్‌ఫ్లై హై ఎనర్జీ లేజర్’, ‘బోయింగ్ కాంపాక్ట్ లేజర్ వెపన్ సిస్టమ్’ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
లేజర్ ఆయుధాలు అధిక శక్తిని ఒకే డ్రోన్‌పై కేంద్రీకరించి దాన్ని ధ్వంసం చేయగలవు. మైక్రోవేవ్ ఆయుధాలు డ్రోన్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలను దెబ్బతీసేలా పనిచేస్తాయి. దీంతో సాధారణ క్షిపణులు, తుపాకులకు ఇవి ప్రత్యామ్నాయంగా మారనున్నాయి.
అమెరికా ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ మాట్ రాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు ఒకే ఆయుధం సరిపోదని చెప్పారు. వివిధ రకాల రక్షణ వ్యవస్థల్లో లేజర్, మైక్రోవేవ్ ఆయుధాలు మరో కీలక మార్గంగా ఉపయోగపడతాయని తెలిపారు.
ఇప్పటికే న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ మిసైల్ రేంజ్లో లేజర్ ఆయుధాన్ని పరీక్షించారు. ఈ పరీక్షపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భద్రతా పరిశీలన చేసింది. అమెరికా గగనతలానికి ముప్పు చాలా తక్కువగా ఉందని తేల్చింది.
డిసెంబరులో ఉటాలోని డగ్వే ప్రూవింగ్ గ్రౌండ్లో మరో పరీక్ష జరగనుంది. మరిన్ని లేజర్, మైక్రోవేవ్ ఆయుధాలను అక్కడ పరీక్షించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని వ్యవస్థలను కూడా కార్యాచరణలోకి తీసుకురావాలని అమెరికా భావిస్తోంది.








