సామాన్యుడిపై ట్రూ-అప్ ఛార్జీల భారం – రాజకీయ రగడ!
ఇళ్లు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు… ఇలా ప్రతి వర్గానికి కరెంటు బిల్లులు రాబోయే రోజుల్లో మరింత భారంగా మారబోతున్నాయి. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (TGERC) తీసుకున్న తాజా నిర్ణయం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక లోట్లను పూడ్చే పేరుతో వినియోగదారులపై ట్రూ-అప్ ఛార్జీల భారాన్ని మోపేందుకు అనుమతి ఇవ్వడం పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఆర్థిక సర్దుబాటు మాత్రమే కాదు. రాబోయే రోజుల్లో రాజకీయంగా పెను తుఫాను సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో అంచనా వేసిన ఖర్చులకు, వాస్తవ వ్యయాలకు మధ్య వ్యత్యాసం కారణంగా డిస్కంలకు భారీగా నష్టాలు వచ్చాయనేది అధికారుల వాదన. దీనిని భర్తీ చేసేందుకే ఈ ట్రూ-అప్ ఛార్జీల వసూలుకు తెరలేపారు. TGERC ఆదేశాల ప్రకారం, నవంబర్ నుంచి యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి 50 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. TGSPDCL, TGNPDCL పరిధిలో సుమారు రూ.7,635 కోట్లకు పైగా మొత్తాన్ని వినియోగదారుల నుంచి రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రభుత్వ వాటాగా రూ. 2,215 కోట్లు ఉండగా, మిగిలిన భారీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బిల్లుల ద్వారానే వసూలు చేయాలని నిర్ణయించారు.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అమలులో ఉన్నందున, ఆ రంగానికి సంబంధించిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిస్కంలను ఆదేశించింది. అయితే గృహ, పారిశ్రామిక రంగాలు మాత్రం ఈ భారాన్ని నేరుగా మోయాల్సి వస్తోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో అల్లాడిపోతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ విద్యుత్ వడ్డన పిడుగుపాటులాంటిదే.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూనే, మరోవైపు సైలంట్ గా ఇలాంటి ఛార్జీల రూపంలో ప్రజల జేబులు గుల్ల చేయడంపై విపక్షాలు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ఆచరణలో జరుగుతున్న విధానాలకు పొంతన లేదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి ఛార్జీల పెంపుపై రాజకీయ రగడ జరిగేది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, డిస్కంల ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపి ప్రజలపై భారం మోపుతోందని విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అయితే, గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాలు, అస్తవ్యస్త విధానాల వల్లే డిస్కంలు ఈ స్థాయి అప్పుల ఊబిలో కూరుకుపోయాయని అధికార పక్షం వాదిస్తోంది.
విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో అమలు చేస్తున్న ఈ తరహా రెట్రోస్పెక్టివ్ ఛార్జీలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఉచిత లేదా సబ్సిడీ పథకాల భారాన్ని బ్యాలెన్స్ చేయడానికే ఈ ట్రూ-అప్ ఛార్జీలను ఆయుధంగా వాడుతున్నారనే విమర్శలు బలపడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిర్ణయంపై పునరాలోచించాలని, డిస్కంల అంతర్గత లీకేజీలు, అవినీతిని అరికట్టకుండా ప్రజలపై భారం మోపడం సరికాదని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.








