వలసవాద అహంకారపూరిత రాతలను తిప్పికొడుతున్న భారత్…
భారతదేశ వన్యప్రాణుల పునరుద్ధరణపై ‘ది ఎకనామిస్ట్’ పత్రిక ప్రచురించిన కథనం వలసవాద కాలం నాటి ఆదరణ ధోరణిని మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం “ఇప్పటికీ సాపేక్షంగా ఒక పేద దేశమే” అయినప్పటికీ, “ఇతర జీవులను రక్షించడం వంటి నిస్వార్థమైన కార్యాన్ని” సాధించిందని ఆ పత్రిక పేర్కొనడం పశ్చిమ దేశాల సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టింది. 140 కోట్ల జనాభా కలిగిన ఒక దేశం, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరే వరకు ప్రకృతిని లేదా జీవులను రక్షించే నైతిక హక్కును కలిగి ఉండదనే రీతిలో ఆ పత్రిక వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ పత్రిక వైఖరిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్రంగా స్పందిస్తూ, వలస సామ్రాజ్యపు అవశేషాలలోని సహజసిద్ధమైన జాత్యహంకార మనస్తత్వాన్ని విడనాడటం కంటే ఖడ్గమృగాల వేటను అణచివేయడం చాలా సులభమని ఎద్దేవా చేశారు.
చరిత్రను విస్మరిస్తున్న అజ్ఞానం…
భారతీయులు వన్యప్రాణుల పరిరక్షణను ఇటీవలే పశ్చిమ దేశాల ప్రభావంతో లేదా ఆర్థిక సమృద్ధి సాధించిన తర్వాతే కనుగొన్నారనే వాదన చారిత్రక సత్యాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలోనే అశోక చక్రవర్తి శాసనాలు జంతువులను హింసించడాన్ని నిషేధించడంతోపాటు జీవజాతుల పరిరక్షణకు పెద్దపీట వేశాయి. రాజస్థాన్లోని బిష్ణోయ్ సమాజం 1730వ సంవత్సరంలోనే ఖేజ్రీ చెట్లను, ప్రకృతిని కాపాడటం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసింది.
మన దేశంలో పవిత్ర వనాలు, అహింస, అలాగే పులి, ఏనుగు, సర్పం, గద్ద వంటి జంతువులను దైవాలుగా ఆరాధించడం భారతీయ నాగరికతలో అంతర్భాగంగా వస్తోంది. స్వాతంత్య్రానంతరం భారత్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అనేక ప్రాజెక్టులను చేపట్టింది. కాశ్మీర్ ఎర్ర జింక కోసం 1970లో ప్రాజెక్ట్ హంగుల్, 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్, ఆ తర్వాత మొసళ్ల సంరక్షణ ప్రాజెక్ట్, మణిపూర్ థామిన్ జింకల పరిరక్షణ, గంగా డాల్ఫిన్ ప్రాజెక్ట్ , 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్లను ప్రారంభించారు. ఇవి ఏవో ఆర్థికంగా సంపన్నమైన దేశాలు విలాసాల కోసం చేపట్టినవి కావు, ఒక యువ గణతంత్ర రాజ్యం తన జీవవైవిధ్యం పట్ల చూపిన అచంచలమైన నిబద్ధతకు నిదర్శనాలు.
ఇవి కూడా చదవండి
వన్యప్రాణులను నాశనం చేసింది ఎవరు?
ది ఎకనామిస్ట్ సంపాదకులు తమ దేశ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే, భారతదేశంలో వన్యప్రాణుల వినాశనానికి అసలు కారణం ఎవరి పాలనలో జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. వలసవాద కాలంలో సాగిన విచ్చలవిడి వేట భారతదేశంలోని పులుల సంఖ్యను తీవ్రంగా దెబ్బతీసింది. ఒక్క 1878లోనే అంచనా ప్రకారం దాదాపు 1,579 పులులను వేటాడి చంపినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతేకాకుండా, 1911లో కింగ్ జార్జ్ వీ కేవలం 11 రోజుల్లో 39 పులులను కాల్చి చంపగా, 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కేవలం నాలుగు రోజుల్లో ఏడు పులులను హతమార్చారు. ఈ దారుణమైన వేట కారణంగా 1972 నాటికి భారత్లో పులుల సంఖ్య కేవలం 1,827కి పడిపోయింది. వన్యప్రాణుల వినాశనానికి కారణమైన సామ్రాజ్యవాద పోకడల నుండి వచ్చిన పత్రికే, నేడు భారత్ సాధించిన పునరుజ్జీవనం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని నిపుణులు మండిపడుతున్నారు.
గణాంకాలు.. వాస్తవాలు
భారత్ కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో అద్భుతమైన ఫలితాలను సాధించి చూపెట్టింది. 2014 నుండి ఇప్పటివరకు దేశంలో పులుల జనాభా 2,226 నుండి 3,682కి పెరిగి దాదాపు 65 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదేవిధంగా, ఆసియా సింహాలు 523 నుండి 891కి (70 శాతం వృద్ధి), చిరుతపులులు 7,910 నుండి 13,874కి (75 శాతం వృద్ధి) పెరిగాయి. ఒక్క అస్సాంలోనే నాలుగు వేలకు పైగా ఒంటి ఖడ్గమృగాలు సురక్షితంగా జీవిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా సాంద్రత కలిగిన దేశాలలో భారత్ ఒకటి అయినప్పటికీ, ప్రజలు , వన్యప్రాణులు ఒకే ప్రాంతంలో సహజీవనం చేస్తూ ఈ రక్షణను సాధ్యం చేయడం విశేషం. పశ్చిమ దేశాలతో పోలిస్తే అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో భారత్ సాధించిన ఈ విజయం ప్రపంచ దేశాలు అధ్యయనం చేయదగినది.
భారతదేశపు వన్యప్రాణుల సంరక్షణ విజయాలు కేవలం గణాంకాలు మాత్రమే కావు. అవి మన ప్రాచీన సంస్కృతి, ఆధునిక శాస్త్రీయ దృక్పథం, గ్రామ ప్రజల భాగస్వామ్యం, అటవీ సిబ్బంది నిబద్ధతకు ప్రతీకలు. వలసవాదపు చిన్నచూపును పక్కనపెట్టి, భారత్ సాధించిన ఈ అరుదైన పర్యావరణ విజయాలను ప్రపంచం గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








