ముంబై కాన్సులేట్‌లో గ్రీన్ కార్డ్ హోల్డర్ తల్లి వీసా తిరస్కరణ.. పొరపాటు ఎక్కడ జరిగింది?
అమెరికాలో గ్రీన్ కార్డ్ కలిగి ఉన్న ఒక భారతీయ మహిళ, ముంబై కాన్సులేట్‌లో తన తల్లికి ఎదురైన B1/B2 వీసా ఇంటర్వ్యూ తిరస్కరణ అనువిధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాము అన్ని వివరాలు సరిగ్గా చెప్పినప్పటికీ వీసా ఎందుకు రిజెక్ట్ అయిందో అర్థం కావడం లేదని సలహా కోరడంతో, భారతదేశంలో పెరుగుతున్న వీసా తిరస్కరణ రేట్ల నేపథ్యంలో ఈ ఉదంతం చర్చనీయాంశమైంది.
వీసా తిరస్కరణకు గల కారణాలు…
వీసా అధికారులు దరఖాస్తుదారులకు భారతదేశంతో బలమైన సంబంధాలు లేవని భావిస్తే, వారిలో “వలస ఉద్దేశం” ఉందని భావించి వీసాలను తిరస్కరిస్తుంటారు. అంటే దరఖాస్తుదారులు తిరిగి భారతదేశానికి రారనే అనుమానంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ ఘటనకు సంబంధించి రెడ్డిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, వీసా అధికారి ఆ తల్లిని ఆమె పర్యటన ఉద్దేశం గురించి ప్రశ్నించారు. ఆమె తన కొడుకుతో కలిసి భారతదేశంలోనే నివసిస్తుండగా, ఆమె కుమార్తెకు అమెరికా పౌరుడైన భర్తతో పాటు యూఎస్ గ్రీన్ కార్డ్ కూడా ఉంది.
ప్రయాణ చరిత్ర, ప్రణాళిక వివరాలు
ఆ తల్లికి అంతర్జాతీయ ప్రయాణాల అనుభవం లేకపోవడం , కుమార్తె గృహప్రవేశ వేడుకకు హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లాలని భావించడం ఇదే మొదటిసారి. ఈ యాత్రను కేవలం ఒక నెల రోజుల పాటు ప్లాన్ చేశారు. వీసా అధికారి ఆమెను యాత్ర ఖర్చుల గురించి ప్రశ్నించగా, భర్తను కోల్పోయిన గృహిణి అయిన ఆ తల్లి తన పొదుపు నుండే ఖర్చులను భరిస్తున్నానని బదులిచ్చారు. “నా ఒక నెల యాత్రకు సరిపడా నా దగ్గర తగినంత పొదుపు ఉంది. నేను మా అబ్బాయితోనే ఉంటాను కాబట్టి అతనే నా ఖర్చులన్నీ చూసుకుంటాడు. అలాగే నా ఎఫ్డీ , ఇతర పెట్టుబడులపై వచ్చే వడ్డీతో కూడా నేను బతుకుతున్నాను” అని ఆమె వివరించారు.
పత్రాల పరిశీలన…
అయితే, “వారు ఎలాంటి పత్రాలు అడగలేదు. మా అమ్మ పేరు మీద ఆస్తులు, పెట్టుబడులన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏం తప్పు జరిగిందో నాకు అర్థం కావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంభాషణ జరిగిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే వీసా రిజెక్ట్ అయింది. అంతేకాకుండా, ఆమెను మళ్లీ దరఖాస్తు చేసుకోమని కూడా వీసా అధికారి సూచించారు. ఇదే తరహా కేసు వేరే కాన్సులేట్‌లో లేదా వేరే అధికారి ద్వారా ఆమోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తల్లికి భారతదేశంతో వాస్తవానికి ఎలాంటి బలమైన బంధాలు లేవని నెటిజన్లు విశ్లేషించారు. అమెరికాలో స్థిరపడిన, ధనవంతురాలైన కుమార్తెను కలిగి ఉండి, స్వయంగా ఉద్యోగం లేని వితంతువు అయిన ఆ తల్లికి భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అధికారులు భావించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.








