ఇంటింటికీ జలధార.. రూ.30,136 కోట్లతో అమరజీవి జలధార పనులకు శ్రీకారం
ప్రొద్దుటూరు, అక్టోబరు 05: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార పనుల్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లిలో పైలాన్ ఆవిష్కరించిన నేతలు ప్రతి ఇంటికీ కుళాయి, ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించేలా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రూ.30,156 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం 13,075 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు 24,601 ఆవాసాలకు నీటి సరఫరాను విస్తరించనున్నారు. ఇందుకోసం 77,243 కిలోమీటర్ల పైపు లైన్ నెట్వర్క్ ను విస్తరించేలా పనులు చేపట్టనున్నారు. తద్వారా మొత్తం 61.60 లక్షల కుళాయి కనెక్షన్లకు మరింత మెరుగైన తాగు నీటి సరఫరా జరగనుంది. మొత్తంగా ఈ పనులతో 3.3 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95 లక్షల కుటుంబాలకు గానూ ఇప్పటికే దాదాపు 62 లక్షల కుటుంబాలకు ఇంటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయని సీఎం తెలిపారు. జల్ జీవన్ మిషన్–2.0 కింద మరో 27 లక్షల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇంటింటికీ తాగునీరు అందడం వల్ల ముఖ్యంగా మహిళల నీటి కష్టాలు తీరతాయని చంద్రబాబు పేర్కొన్నారు. నీటి కోసం వెచ్చించే శ్రమ, సమయం, ఖర్చు ఆదా అవుతాయని.. స్వచ్ఛమైన నీటితో ప్రజలకు మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని వివరించారు. జల్ జీవన్ మిషన్ ప్రధాన ఉద్దేశం శాశ్వత నీటి వనరుల నుంచి ప్రజలకు తాగునీరు సరఫరా చేయడమేనని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో ఈ పథకం అమలులో లోపాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. కేంద్రం నుంచి భారీగా నిధులు పొందిన రాష్ట్రాలతో పోలిస్తే గత ప్రభుత్వం ఏపీలో ఈ పథకానికి కేవలం రూ. 2,600 కోట్లు మాత్రమే వినియోగిం చిందని పేర్కొన్నారు. తాగు నీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం తెలిపారు. పల్లె పండుగ–3.0 ద్వారా రూ.11,085 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, పంట కుంటలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం రానున్న కాలంలో రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి-రాయలసీమకు జల భద్రత
తాగునీటి అవసరాలతో పాటు సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా నీటి నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించిందని చంద్రబాబు తెలిపారు. రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా తెలుగుతల్లికి జలహారతి ఇచ్చామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో రూ.35 వేలకోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తేదీలతో సహా ప్రాజెక్టుల క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు కరవు సమస్య ఉండదన్నారు. కరవు పరిస్థితుల్లోనూ 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని చెప్పారు. కనీసం 200 టీఎంసీల గోదావరి వరద జలాలను వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు.
హంద్రీ–నీవా ఫేజ్–1ను పూర్తి చేసి రాయలసీమలో రిజర్వాయర్లను నింపామని, వెలిగొండ ఫేజ్–1 ద్వారా నల్లమల సాగర్‌కు నీరు తీసుకెళ్లామని వివరించారు. పోలవరం ప్రాజెక్టును రానున్న గోదావరి పుష్కరాలకు ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. రాయలసీమ దశ, దిశ మార్చేలా రూ.1 లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ హబ్‌తో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, మార్కెటింగ్ సౌకర్యాలు పెరుగుతాయని చెప్పారు. స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, సిమెంట్, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ, గోల్డ్ మైనింగ్ వంటి రంగాల్లో ప్రాజెక్టులు రానున్నాయని వెల్లడించారు. సినిమాల్లో ఒకప్పుడు రాయలసీమను ముఠా కక్షలకు ప్రతీకగా చూపించేవారని…ఇకపై శత్రు దేశాలను చీల్చిచెండాడే ఫైటర్ జెట్లు మేడ్ ఇన్ రాయలసీమ అని చెప్పుకునే రోజులు వస్తాయన్నారు. ఇక్కడ పండే ఫలాలు ప్రపంచ మార్కెట్లకు రాయలసీమ బ్రాండ్‌తో ఎగుమతి అవుతాయని సీఎం అన్నారు.
ప్రతి కుటుంబానికి భరోసా
పేదల సాధికారత, వ్యక్తిగత ఆదాయాల పెంపు, గ్రామాలు–పట్టణాల అభివృద్ధి, నాణ్యమైన జీవితం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో 19 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. పేదలకు శాశ్వత హక్కులు కల్పించేలా ఇళ్ల పట్టాలు ఇచ్చామని, విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60 వేల మందికి రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తులు అందించామని వివరించారు. ప్రతి కుటుంబానికి భరోసా.. ప్రతి వర్గానికి అండ.. ప్రతి ప్రాంతానికి అవకాశం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామాల్లో రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు వంటి కనీస వసతులు కూడా లేకుండా పోయాయని సీఎం అన్నారు. రోడ్ల విషయంలో నాడు-నేడు బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు. పల్లెలకు రహదారుల కల్పనలో పవన్ కల్యాణ్ తనదైన ముద్ర చూపిస్తున్నారని ప్రశంసించారు. 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించి రికార్డు సృష్టించామని సీఎం తెలిపారు. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల ద్వారా రూ.4,136 కోట్లకు పైగా నిధులు వచ్చాయని చెప్పారు. పంట కుంటలు, గ్రామాలకు రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలతో అభివృద్ధి వేగం పుంజుకుందని వివరించారు.
దొంగ పనులే గొడ్డలి పార్టీ సిద్ధాంతం
2024 ఎన్నికల్లో ప్రజలు గొడ్డలి పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడప జిల్లాలోనూ ఆ పార్టీకి చెంపదెబ్బ కొట్టారన్నారు. వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిందని, రూ.40 కోట్ల సుపారీ అంశం బయటకు వచ్చిందని అన్నారు. మద్యం కుంభకోణంలో వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. అందులోనూ అంతిమ లబ్దిదారుగా అన్ని వేళ్లూ గొడ్డలి పార్టీ అధినేత వైపే చూపిస్తున్నాయని అన్నారు. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని … వీటిపై వాస్తవాలు మాట్లాడకుండా ఫేక్ ప్రచారంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు.గ్రూప్ వన్ సర్వీసు పరీక్షలు రాస్తే జవాబు పత్రాలను అటెండర్లు, ఎలక్ట్రీషన్లతో దిద్దించారని..ఇసుకలోనూ దోపిడీ చేశారు. ఈ అక్రమాలు అన్నిటికీ సమాధానం చెప్పాలని సీఎం సవాలు విసిరారు. నేరాలు ఘోరాలు చేసి ప్రజల్ని మోసం చేయడానికి ఫేక్ ప్రచారం చేస్తారని ఎద్దేవా చేశారు. .గొడ్డలి పార్టీ తోక తిప్పితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఓ సిద్ధాంతం అంటూలేని గొడ్డలి పార్టీ కుట్రలు , ఫేక్ ప్రచారమే అజెండా అని సీఎం ఆక్షేపించారు. నేరాలు చేసి ఎదుటి వాళ్లపై నెట్టేయటం వారి డీఎన్ఏ లోనే ఉందన్నారు. వివేకా హత్య నుంచి మద్యం కుంభకోణం వరకూ, సింగయ్యను కారుకింద తొక్కించటం నుంచి మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ కేసు తప్పించటం వరకూ అన్నీ దొంగ పనులే చేశారని ఎద్దేవా చేశారు. బలవంతపు మతమార్పిడులు, హిందువులను క్రిష్టియన్లుగా మార్చటం లాంటి చర్యలు చేస్తున్నారని.. ఇలాంటి వన్నీ ఆ పార్టీ సిద్ధాంతంలో భాగమేనని అన్నారు. రాయలసీమలో కనీసం కడపకు ఏం చేశారో చెప్పగలరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
స్థానిక సంస్థల్లోనూ కూటమి ట్రిపుల్ ఇంజన్ సర్కార్
అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కావాలని కోరడం సరికాదని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని, ప్రజలు ఇచ్చే అధికారమని గుర్తుంచుకోవాలని సూచించారు. 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు ఐదు సీట్లు లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉండదని ఎగతాళి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాను కూడా రాయలసీమ బిడ్డనేనని, ఈ ప్రాంతాన్ని తిరుగులేని అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సీమ అభివృద్ధి బుల్లెట్లా దూసుకెళ్తుందని.. రాయలసీమకు రప్పారప్పా రాజకీయాలు కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలో, స్థానిక సంస్థల్లో కూటమి ఉంటే ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ఉన్నట్టేనని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రం బాగుంటేనే ప్రజలంతా బాగుంటారని చెప్పారు. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. అరాచకం వద్దు.. అభివృద్ధి కావాలి. సంక్షోభం వద్దు.. సంక్షేమం కావాలి. రాయలసీమకు శాంతి, నీళ్లు, పరిశ్రమలు, సుపరిపాలన, ఉపాధే కావాలని సీఎం వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాయలసీమ రైజింగ్‌ను ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్.సవిత, పి.నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.









