రేవంత్, జాహ్నవి మార్ఫింగ్ వీడియోలపై ఉక్కుపాదం!
డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, దానిని దుర్వినియోగం చేసే వాళ్లు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్ఫింగ్ టెక్నాలజీలను ఉపయోగించి ప్రముఖులపై బురదజల్లే సంస్కృతి పెరుగుతోంది. ఇది రాజకీయంగా, సామాజికంగా కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్, నటి సురేఖ వాణిలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఇమేజ్‌లు, ఏఐ జనరేటెడ్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ అయ్యారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాధారణంగా ఎన్నికల సమయాల్లో లేదా రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధాలు, విమర్శలు సహజం. అయితే, గత కొంతకాలంగా ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక.. వ్యక్తిగత దూషణలకు, అభ్యంతరకర మార్ఫింగ్ చిత్రాలకు దిగడం సోషల్ మీడియాలో సర్వసాధారణమైపోయింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటితో ముడిపెడుతూ మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు సృష్టించారు. ఇది కేవలం వ్యంగ్యం కాదు.. ఇదొక కుట్ర. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు సహజం.. కానీ వ్యక్తిగత పరువును దిగజార్చేలా ఏఐ టెక్నాలజీని వాడటం అత్యంత హేయమైన చర్య.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలో బ్లూ టిక్ ఉన్న వెరిఫైడ్ ఖాతాల ద్వారానే ఈ దుష్ప్రచారం జరగడం వెనుక వ్యవస్థీకృత శక్తుల ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను విమర్శించే స్వేచ్ఛ అందరికి ఉంటుంది. అయితే ఒక మహిళా నటి గౌరవాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాను మంటకలిపేలా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం భావప్రకటన స్వేచ్ఛ కిందకు రాదు. ఇది ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమంగానే చూడాలి.
ఇక.. దేవర సినిమాలోని చుట్టమల్లె పాటను మార్ఫింగ్ చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు. డీప్ ఫేక్, ఏఐ మార్ఫింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాక, ఎవరు పడితే వాళ్లు ఇలాంటి అశ్లీల వీడియోలను రూపొందిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా, మహిళా సెలబ్రిటీల భద్రతకు, ఆత్మగౌరవానికి తీవ్ర భంగం కలిగిస్తోంది.
ఈ సంఘటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల యాజమాన్యాలకు లేఖలు రాసి, అటువంటి అభ్యంతరకర లింక్‌లను తక్షణమే బ్లాక్ చేయిస్తున్నారు. అయితే, ఇంటర్నెట్ వేదికగా జరిగే ఇటువంటి నేరాలపై కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా, కఠినమైన శిక్షలు పడేలా చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.








