అమెరికాలో ఘనంగా ముగిసిన ‘శంకర నేత్రాలయ’ సంగీత, నృత్య వేడుకలు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఇర్వింగ్లో శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అంధత్వ నివారణకు నిధుల సేకరణ , చైతన్యమే లక్ష్యంగా అక్టోబర్ 4, 2026 న ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లో ఈ ప్రత్యేక సాంస్కృతిక వేడుకను ఘనంగా చేపట్టారు.
కార్యక్రమ విశేషాలు ..
ఈ వేడుకకు శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫౌండర్, ప్రెసిడెంట్ ఎమెరిటస్ శ్రీ ఎస్.వి.ఆచార్య, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్.ఎస్. బద్రీనాథ్ మార్గదర్శకత్వంలో ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి (బ్రాండ్ అంబాసిడర్, బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్, SNUSA) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రముఖ గాయకులు రాము, అంజన సౌమ్య తమ మధురమైన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. శిరీష కాటంరాజు మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి
ప్రత్యేక ఆకర్షణగా నృత్య ప్రదర్శనలు..
డల్లాస్లోని ప్రముఖ ఇండియన్ డ్యాన్స్ అకాడమీల ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్యాలు ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సెంటర్ ఫర్ కూచిపూడి డ్యాన్స్-టెక్సాస్, గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్, నాట్యం డ్యాన్స్ అకాడమీ, రాగాలీన డ్యాన్స్ అకాడమీ, రాగమయూరి స్కూల్ ఆఫ్ డ్యాన్స్, తాండవం స్కూల్ ఆఫ్ కూచిపూడి తదితర సంస్థల విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఉచిత ప్రవేశం ..
ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రేక్షకులకు ఉచిత ప్రవేశంతో పాటు కాంప్లిమెంటరీ బాక్సెడ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. సీటింగ్ పరిమితంగా ఉండటంతో ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో వసతి కల్పించారు. ఈ వేడుక ద్వారా వచ్చే విరాళాలను శంకర నేత్రాలయ చేపడుతున్న కంటి చూపు సేవా కార్యక్రమాలు, ‘అడాప్ట్-ఎ-విలేజ్’ ప్రాజెక్టులు , మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ల నిర్వహణకు ఉపయోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డల్లాస్ టీమ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల చొరవతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.








