నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌత్ జోన్ రీజినల్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….
NALSA ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ మండల ప్రాంతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషం.
ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ రాష్ట్రం తరపున స్వాగతం.
నిన్న మన దేశం, యావత్ ప్రపంచం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంది.
గాంధీజీ ముందుగా ఒక న్యాయవాది. ఆయన న్యాయాన్ని కేవలం వృత్తిగా చూడలేదు.
పేదలు, బలహీనుల కోసం న్యాయాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించారు.
అదే స్ఫూర్తితో న్యాయ సేవా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి.
ప్రతి ఒక్కరికీ న్యాయం అందాలి. డబ్బు లేకపోవడం వల్ల ఎవరికీ న్యాయం దూరం కాకూడదు.
ఈ సదస్సుకు పిల్లల సైబర్ భద్రత అనే చాలా ముఖ్యమైన అంశాన్ని ఎంచుకున్నందుకు జస్టిస్ విక్రమ్ నాథ్ గారికి, NALSA కు ధన్యవాదాలు.
ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతున్నారు.
కానీ తమ పిల్లలు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు అనేది చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదు.
ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను ఎంతో సులభం చేశాయి.
ప్రపంచంలోని సమాచారం మన చేతిలోకి వచ్చింది.
ఎక్కడున్న వారితోనైనా, ఎప్పుడైనా మాట్లాడగలుగుతున్నాం.
కానీ పిల్లలు అమాయకులు. ఏది నిజం? ఏది అబద్ధం? ఏది మంచిది? ఏది ప్రమాదకరం? అన్నది వారు వెంటనే గుర్తించలేరు.
తెలియక పిల్లలు చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు.
వాటి ప్రభావం పిల్లలపైనే కాదు… వారి కుటుంబాలపై, సమాజంపై కూడా పడుతుంది.
ఇంటర్నెట్ ఈ నేరాలను సృష్టించలేదు. కానీ నేరాలను ప్రపంచవ్యాప్తంగా చేయడం మరింత సులభం చేసింది.
తల్లిదండ్రులకు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు.
భయంతో పిల్లలు తమ సమస్యలను ఎవరికీ చెప్పలేకపోవచ్చు.
అందుకే మన ముందున్న ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి.
పిల్లలపై సైబర్ నేరాలను ఎలా అరికట్టాలి? మన పిల్లలను ఎలా సురక్షితంగా ఉంచాలి?
బాధిత పిల్లలకు న్యాయం ఎలా అందించాలి?
తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణ మా ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత.
పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు… మన దగ్గర అనేక వ్యవస్థలు ఉన్నాయి.
అయితే ఇవన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలి.
అప్పుడే ఒక బిడ్డకు పూర్తి రక్షణ కల్పించగలం.
మన భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకే చోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నాం.
దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం.
పిల్లల రక్షణ కోసం పోలీసు శాఖలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి.
CybHER యాప్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం.
విద్యార్థులనే సైబర్ అంబాసిడర్లుగా తయారు చేసి, తమ తోటి విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం.
అన్ని శాఖలు కలిసి పనిచేస్తేనే పిల్లలకు రక్షణ లభిస్తుంది.
బాధితులకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
ఆర్థిక సహాయం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించడం వరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
TGS-LSA పాఠశాల విద్యాశాఖతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.
దీంతో ఉపాధ్యాయులు పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చాం.
ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలంగాణ హైకోర్టుకు,TGS-LSAకు నా ధన్యవాదాలు.
న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదు.
న్యాయం అంటే బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం.
న్యాయం అంటే అతని గౌరవాన్ని తిరిగి ఇవ్వడం.
ముఖ్యంగా… ఒక బిడ్డ కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయం.
ఈ సందర్భంగా సంబంధిత అన్ని శాఖలకు నేను ఒక ముఖ్యమైన ఆదేశం ఇస్తున్నా.
తెలంగాణ హైకోర్టు, టీజీఎస్-ఎల్ఎస్ఏతో కలిసి చర్చించి పిల్లల ఆన్లైన్ భద్రత కోసం సమగ్ర చైల్డ్ ఆన్లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయాలి.
న్యాయ సేవా సంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి చేరేలా మా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలి.
పిల్లల ఆన్లైన్ భద్రతపై జరిగే ప్రతి చర్చలో తల్లిదండ్రులు భాగం కావాలి.
ప్రతి పిల్లవాడు, ప్రతి తల్లిదండ్రి సైబర్ నేరాల కోసం – 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం – 1098 నంబర్లు తప్పక గుర్తుంచుకోవాలి.
తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే…
మీ పిల్లలతో మాట్లాడండి. వారు ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చూస్తున్నారు? తెలుసుకోండి.
కానీ వారిని తప్పుపట్టేలా కాదు… ఆసక్తితో, అవగాహనతో మాట్లాడండి.
ఎందుకంటే… వాళ్లు మన పిల్లలు. వారికి మన మద్దతు కావాలి. మన మార్గదర్శకత్వం కావాలి.
అన్నింటికంటే ముఖ్యంగా… మన ప్రేమ, మన అవగాహన కావాలి.
మన పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు మనమంతా కలిసి పనిచేద్దాం.
ఈ సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
ఈ సదస్సులో జరిగే చర్చలు, అందించే సిఫారసులు తెలంగాణకే కాదు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తాయని నేను విశ్వసిస్తున్నా.








