పాడి కౌశిక్ రెడ్డికి రేపే డెడ్ లైన్!
తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ విచారణ హాట్ టాపిక్‌గా మారింది. కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై అసెంబ్లీలో వచ్చిన ఫిర్యాదులు, తదనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు కలకలం రేపాయి. ఈ అంశంపై విచారణ జరపాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎథిక్స్ కమిటీని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన ఎథిక్స్ కమిటీ పాడి కౌశిక్ రెడ్డిని విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పటికే పలు మార్లు తనకు గడువు కావాలంటూ పాడి కౌశిక్ రెడ్డి లేఖలు రాస్తూ వచ్చారు. అయితే ఎథిక్స్ కమిటీ రేపటి వరకూ గడువు ఇవ్వడంతో.. తదుపరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆసక్తి రేపుతోంది.
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తన హుందాగా ఉండాలనే నిబంధనలున్నాయి. అయితే గత కొంతకాలంగా అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన చేసిన వ్యాఖ్యలు, అధికార పార్టీ నేతలతో ఘర్షణ వాతావరణంపై ఫిర్యాదులు వచ్చాయి. సభలో సభా మర్యాదలను ఉల్లంఘించారనే ఆరోపణలతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు కూడా నడిచాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదులు అందాయి.
తనపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పాడి కౌశిక్ రెడ్డి గతంలో ఎథిక్స్ కమిటీకి ఒక లేఖ రాశారు. తనకు తగిన సమయం కావాలని కోరుతూ ఆరు వారాల గడువు ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో ఆయన అభ్యర్థించారు. అయితే, ఆయన కోరిన విధంగా సుదీర్ఘ సమయం ఇచ్చేందుకు కమిటీ సుముఖత చూపలేదు. ఆయన రాసిన లేఖను పరిశీలించిన ఎథిక్స్ కమిటీ, ఆ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 11వ తేదీలోగా తమ ముందు హాజరై లేదా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది. రేపటితో ఈ గడువు ముగియనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చే వివరణ లేదా ఆయన స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు ఎథిక్స్ కమిటీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 13 న ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో కౌశిక్ రెడ్డి వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించి, కమిటీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ వేదికగా ఒక ప్రధాన పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతుండటం, త్వరలోనే కీలక సిఫార్సులు వెలువడే అవకాశం ఉండటంతో ఈ అంశం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూను అధికార పార్టీ నాయకులు సీరియస్‌గా తీసుకుంటుండగా, మరోవైపు కౌశిక్ రెడ్డి దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు గడువు ముగియడం, ఈ నెల 13న ఎథిక్స్ కమిటీ భేటీ కానుండటం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.








