ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్ ఎంట్రీ!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దశాబ్ద కాలంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ‘ఓటుకు నోటు’ కేసు మరోసారి ప్రకంపనలు రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వెలుగు చూసిన ఈ ఉదంతం, కాలక్రమేణా మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన బాధితుడిగా, ఫిర్యాదుదారుడిగా ఉన్న నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే ఎన్. స్టీఫెన్సన్ సుప్రీంకోర్టులో తాజాగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
2015 మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి 2021 జూలై 22న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఎన్నికల చట్టాల నియామావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధమని, కాబట్టి ఈ కేసు చెల్లదని ఆయన తన స్పెషల్ లీవ్ పిటిషన్లో వాదించారు. అలాగే, ఇదే కేసులో తన పేరును పూర్తిగా తొలగించాలని కోరుతూ మరో నిందితుడు సండ్ర వెంకట వీరయ్య సైతం 2021 ఏప్రిల్ 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ రెండు పిటిషన్లు సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ దశలో ఉన్నాయి.
తాజాగా ఈ పిటిషన్లు విచారణకు వచ్చిన సందర్భంగా, స్టీఫెన్సన్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ను ప్రస్తావించారు. ఫిర్యాదుదారుడిగా తన వాదనలను కూడా వినడం న్యాయపరంగా అత్యంత కీలకమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం, స్టీఫెన్సన్కు వాదనలు వినిపించేందుకు అనుమతిస్తూ విచారణను పది రోజులకు వాయిదా వేసింది. నిందితులు తమపై ఉన్న కేసులను కొట్టివేయాలని కోరుతున్న తరుణంలో, అసలు ఫిర్యాదుదారుడైన స్టీఫెన్సన్ కోర్టును ఆశ్రయించడం ఈ కేసులో కొత్త మలుపు ఖాయమని అర్థమవుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో జరిగిన తొలి ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పట్లో తీవ్ర రాజకీయ వేడిని రాజేశాయి. టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కావలసిన సంఖ్యాబలం లేకపోవడంతో, నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ మద్దతు కీలకంగా మారింది. ఈ క్రమంలో నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఆయన సహచరులు స్టీఫెన్సన్ నివాసానికి వెళ్లి రూ. 50 లక్షల నగదుతో బేరసారాలు జరిపారనే ఆరోపణలు వెలుగుచూశాయి. అయితే, ఈ వ్యవహారంపై ముందస్తు సమాచారం అందుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు అక్కడే రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు అప్పట్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో భూకంపం సృష్టించాయి. ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి, తీవ్ర ఆరోపణలకు ఈ కేసు కేంద్ర బిందువైంది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత పదవిలో కొనసాగుతున్న తరుణంలో, సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మళ్లీ జోరందుకోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఫిర్యాదుదారుడిగా స్టీఫెన్సన్ కోర్టులో గట్టిగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవ్వడం ఈ న్యాయపోరాటాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో ఎలాంటి తుది తీర్పు ఇస్తుంది, ఇది భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.








