చెన్నూరులో శ్రీ కోదండరామ భజనమందిరం నిర్మాణానికి ఎంపి బాలశౌరి సహాయం
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెడన మండలం చెన్నూరు గ్రామంలో ప్రతిపాదిత శ్రీ కోదండరామ భజన మందిర నిర్మాణానికి, ప్రజా ఉపయోగకర అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తానని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ‘తెలుగు టైమ్స’ (అమెరికా) ఎడిటర్ అండ్ సీఈఓ, శ్రీ కోదండరామ ట్రస్ట్ (చెన్నూరు) అధ్యక్షుడు శ్రీ చెన్నూరి వెంకట సుబ్బారావు, ఎంపీ బాలశౌరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భజన మందిర నిర్మాణ ప్రతిపాదనలను ఎంపీకి వివరించి, తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. చెన్నూరు గ్రామంలో మూడో తరానికి చెందిన తాము గత 20 ఏళ్లుగా గ్రామస్తుల సహకారంతో శ్రీ కోదండరామ గుడి నిర్వహణ బాధ్యతలను చూస్తున్నామని తెలిపారు. ఇప్పుడు గ్రామ ప్రజల కోరిక మేరకు భక్తజనుల కోసం ఒక భజన మందిరాన్ని కూడా నిర్మించాలని తలపెట్టినట్లు చెప్పారు. ఇందుకు మీ సహాయం కావాలని విన్నవించినప్పుడు అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రజా ప్రయోజనార్థం చేపట్టే ఈ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎంపి బాలశౌరి హామీ ఇచ్చారు.
ఈ భజనమందిర నిర్మాణానికి దాతలు, శ్రేయోభిలాషులు ఉదారంగా విరాళాలు అందించి నిర్మాణానికి తోడ్పడాలని శ్రీ సుబ్బారావు ఒక ప్రకటనలో కోరారు. విరాళాలు, ఇతర వివరాలకోసం తనను సంప్రదించవచ్చని చెప్పారు.
ఫోన్ నంబర్ (91) 98495 99625,
ఈమెయిల్ [email protected]








