సీఎం చంద్రబాబుతో పవన్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. తొలుత చంద్రబాబుతో కలిసి పవన్ అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఎన్నికల అంశంపై చర్చించారు. దాదాపు రెండు గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. కూటమి పార్టీల మధ్య స్థానాల సర్దుబాటు, ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి? కీలకమైన కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థులు (Mayoral candidates) గా ఎవర్ని ఎంపిక చేయాలి? అన్న అంశాలతో పాటు, ఎన్నికల వ్యూహాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) వచ్చిన వెంటనే సమన్వయంతో ముందుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవడం పైనా చర్చించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటుతూ అన్ని స్థాయిల్లో బలమైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా నేతలు వ్యూరచన చేశారు.








