రాహుల్ పోరాటానికి వణికిపోతున్న కేంద్ర ప్రభుత్వం… సీఎం రేవంత్రెడ్డి
* సర్ రద్దు… సీఈసీ జ్ఞానేష్ రాజీనామా చేసే వరకు విశ్రమించం
* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
* రాహుల్, ప్రియాంక, కేసీ, ఎంపీల అరెస్టులకు తీవ్ర ఖండన
హైదరాబాద్ (అక్టోబరు 6, 2026): ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంతో కేంద్ర ప్రభుత్వం వణికిపోతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. అస్తవ్యస్తంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (శీఋ-సర్) రద్దు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులా మారిన * సర్* రద్దు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటు బచావో… దేశ్ బచావో(ఓటును రక్షిద్దాం.. దేశాన్ని రక్షిద్దాం) ఉద్యమంలో భాగంగా అహింసాయుతంగా ఆందోళన చేస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలను ఢిల్లీలో అరెస్టు చేయడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య, చట్ట విరుద్ధమైన ఈ అరెస్టులు బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శమని సీఎం పేర్కొన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనూ స్వల్ప కారణాలకే మహాత్మా గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి నేతలను నాటి వలస ప్రభుత్వం అరెస్టు చేసేదని, ఇప్పుడు బ్రిటిష్ జనతా పార్టీ (బీజేపీ) కూడా అలానే రాహుల్ గాంధీని అరెస్టు చేసిందని సీఎం విమర్శించారు. అక్రమ అరెస్టులు, జైళ్లు కాంగ్రెస్ నేతలకు కొత్త కాదని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరి ఓటు హక్కును, దేశ ప్రజాస్వామిక వ్యవస్థను, దేశ భవిష్యత్తును రక్షించుకునేందుకు ప్రజలు, యువత రాహుల్ పోరాటంలో స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని సీఎం హెచ్చరించారు. అక్రమ అరెస్టులు, జైళ్లు, లాఠీఛార్జీలు కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయలేవని, తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తాయని సీఎం తెలిపారు.
దేశ స్వాతంత్య్రం కోసం వందేళ్లకు పైగా పోరాడిన చరిత్ర కాంగ్రెస్కు ఉందనే విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గుర్తుంచుకోవాలని సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో తుది వరకు పోరాడతామని, ఈ పోరాటంలో విజయం సాధించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు.








