పిల్లలు ఎక్కువగా పుడితేనే మీ ఊరికి మెట్రో వస్తుందా? ట్రంప్ సర్కార్ కొత్త లెక్క ఇదే
ఒక ప్రాంతానికి మెట్రో కావాలంటే అక్కడ ప్రజలు ఉండాలి. వాళ్లకు ఎక్కడికో వెళ్లాల్సి ఉండాలి. రూడ్లపై పట్టనంత ట్రాఫిక్ ఉండాలి. అంత ట్రాఫిక్ ఉంది కాబట్టి మెట్రో కావాలి అనాలి. అలాగే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉండాలి. మొత్తానికి, ఒక నగరానికి రైలు అవసరం ఉందని నిరూపించడానికి ట్రాఫిక్ అంచనా ఉండేది. ఇప్పుడు ఈ లెక్కలు మారుతున్నాయి.
కొత్త లెక్కలేంటి
ఒక ప్రాంతంలో ఎంతమంది పెళ్లి చేసుకున్నారు? ఎంతమంది పిల్లలు పుట్టారు? జాతీయ సగటుతో పోలిస్తే ఆ సంఖ్య ఎలా ఉంది? ఇవి ఇకపై కుటుంబ గణాంకాల శాఖలోని ప్రశ్నలుగా మాత్రమే మిగిలిపోకపోవచ్చు. అమెరికా ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానం అమల్లోకి వస్తే, ఇవే ప్రశ్నలు ఒక రోజు “ఈ ప్రాంతానికి మెట్రో లైన్ వేయాలా?” అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పవచ్చు.
అంటే, మీ ఊరికి మెట్రో రావాలంటే ముందుగా అక్కడి జనాభా పెరగాలి. జనాభా పెరగాలంటే పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టాలంటే ప్రభుత్వ లెక్కల్లో ఎక్కువ పెళ్లిళ్లు జరగాలి. ఇది రవాణా ప్రణాళికకు కొత్త అర్థం ఇచ్చే విధానం.
అంటే “మీ నగరంలో ట్రాఫిక్ ఎంత?”** అనే ప్రశ్నకు పక్కనే “మీ నగరంలో బేబీ షవర్లు ఎంత?” అనే ప్రశ్న కూర్చోబోతున్నట్టుంది.
మెట్రో ప్రాజెక్టుకు కుటుంబ ఫోటో ఎందుకు కావాలి?
అమెరికా ఫెడరల్ ట్రాన్సిట్ అడ్మినిస్ట్రేషన్ భారీ ప్రజా రవాణా ప్రాజెక్టులకు ఇచ్చే నిధుల నిబంధనలను మార్చాలని ప్రతిపాదించింది. కొత్త ఫార్ములాలో ఒక ట్రాన్సిట్ కారిడార్‌లోని వివాహ రేటు, జనన రేటు కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
ఈ రేట్లు జాతీయ ప్రమాణాలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, కొన్ని ప్రాజెక్టులకు ఫెడరల్ ప్రభుత్వం భరించే వాటా 10 శాతం పాయింట్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇంకా ప్రతిపాదన మాత్రమే. నవంబర్ 16 వరకు ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం స్వీకరిస్తోంది.
కాబట్టి ప్రస్తుతానికి ఏ అమెరికన్ నగరమూ తన మెట్రో స్టేషన్ బయట “ముందు ముగ్గురు పిల్లలు. తర్వాత మూడు స్టేషన్లు.” అని బోర్డు పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ దిశగా ఒక విధానపరమైన తలుపు మాత్రం తెరుచుకుంది.
అమెరికాకు రైళ్ల కంటే ముందు ప్రయాణికులు కావాలా?
ఈ ప్రతిపాదనలోని గమ్మత్తు ఏమిటంటే, ప్రభుత్వం రవాణా వ్యవస్థ భవిష్యత్తును అంచనా వేయడానికి భవిష్యత్తులో పుట్టబోయే ప్రయాణికుల సంఖ్యను కూడా చూడాలనుకుంటోంది.
అంటే మెట్రో రేపు ఎక్కడ నిర్మించాలి? సమాధానం ఒకప్పుడు: “ఎక్కడ ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు?” . అదే ఇప్పుడు: “ఎక్కడ ఎక్కువ మంది పుట్టబోతున్నారు?” అనే ప్రశ్న కీలకం కానుంది.
ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా, అమెరికా ఎదుర్కొంటున్న జనాభా లెక్కలను, మార్పును చూస్తే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమవుతుంది. గత కొంతకాలంగా దేశంలో జననాల రేటు చాలా సంవత్సరాలుగా పడిపోతోంది. 2025లో ఫెర్టిలిటీ రేటు రికార్డు కనిష్ఠ స్థాయికి చేరింది—15 నుంచి 44 ఏళ్ల వయసున్న ప్రతి 1,000 మంది మహిళలకు 53.1 జననాలు. అంటే దేశం వృద్ధాప్యం వైపు ప్రయాణం పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం యువ కుటుంబాల సంఖ్య పెరగాలని కోరుకుంటోంది. ఇప్పుడు ఆ ప్రయత్నం ట్రాన్సిట్ ఫండింగ్ ఫార్ములాలోకి కూడా నడుచుకుంటూ వచ్చింది.
పెళ్లి చేసుకోండి. పిల్లలు కనండి. మీకు లైట్ రైల్ వస్తుంది.
ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ సీన్ డఫీ అమెరికా యువత పెళ్లి చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనాలని గతంలో ప్రోత్సహించారు. ఆయనకు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు. ఇది ఒక విధంగా వ్యక్తిగత ఉదాహరణగా చెప్పినంతవరకూ బాగానే ఉంది. అయితే ప్రభుత్వం దానిని ఒక మౌలిక వసతుల విధానంగా మార్చినప్పుడు విషయం కొంచెం ఆలోచనలో పడేస్తుంది.
ఇదంతా చదివాక… ఒక యువ జంట ఆదివారం ఉదయం కాఫీ తాగుతూ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటుందని ఊహించండి.
“మనకు పిల్లలు కావాలా?”
“తెలియదు.”
“కానీ మన ప్రాంతానికి కొత్త మెట్రో కావాలట.”
“అయితే?”
“మన కుటుంబ పరిమాణం పెరగాలి. పుట్టబోయే పిల్లలు ప్రభుత్వ ఫండింగ్ ఫార్ములాను ప్రభావితం చేయొచ్చు.”
కొన్ని దశాబ్దాల క్రితం ఇది కుటుంబ చర్చలా ఉండేది. ఇప్పుడు అది ట్రాన్స్‌పోర్టేషన్ పాలసీ చర్చలా కూడా కనిపిస్తోంది.
ప్రభుత్వానికి ఒక చిన్న సమస్య ఉంది
ప్రజలను పిల్లలు కనమని ప్రోత్సహించడం ఒక విషయం. వాళ్లు నిజంగానే పిల్లలు కనడం మొదలుపెట్టేలా చేయడం మరో విషయం. ప్రభుత్వం మెట్రో లైన్‌కు డబ్బు ఇవ్వగలదు. రోడ్డు వేయగలదు. బస్ కొనగలదు. స్టేషన్ నిర్మించగలదు. కానీ ఒక జంట ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలు కనాలి అనే నిర్ణయానికి బడ్జెట్ కేటాయించడం కొంచెం కష్టమైన పని.
అందుకే ఈ విధానం విమర్శకులకు విచిత్రంగా కనిపిస్తోంది.
ఒబామా హయాంలో FTAను నడిపిన పీటర్ రోగాఫ్ దీనిని విమర్శించారు. రవాణా మౌలిక వసతుల కార్యక్రమం ద్వారా పెళ్లిళ్లు, పిల్లల పెంపకాన్ని ప్రోత్సహించాలనుకోవడం తగిన విధానం కాదని ఆయన అన్నారు. ఎవరైనా , ఎక్కడైనా ఒక జంట నిజంగా “కొన్నేళ్ల తర్వాత మన ప్రాంతానికి మెట్రో రైల్ రావచ్చు కాబట్టి మనం పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి” అని నిర్ణయించుకుంటుందా? అంటున్నారు. అయితే ఇదే సక్సెస్ అయితే మాత్రం అమెరికా ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన matchmaker అయిపోతుంది.
వాస్తవానికి దేశంలో పిల్లలు తగ్గితే భవిష్యత్తులో కార్మికులు తగ్గుతారు. పన్నులు చెల్లించే వారి సంఖ్యపై ప్రభావం పడుతుంది. వృద్ధుల సంరక్షణ భారం పెరుగుతుంది. పాఠశాలల అవసరాలు మారతాయి. ఇళ్ల మార్కెట్ మారుతుంది. నగరాల ఆకృతి మారుతుంది. చివరికి రవాణా వ్యవస్థ కూడా మారుతుంది. అందుకే ఒక ప్రాంతంలో పిల్లలు ఎంతమంది పుడుతున్నారు అనే విషయం నిజానికి భవిష్యత్తులో అక్కడ ఎన్ని బస్సులు ,రైళ్లు అవసరం అవుతాయి అనే ప్రశ్నతో పూర్తిగా సంబంధం లేనిది కాదు. సమస్య ఏమిటంటే దానిని ఎలా కొలుస్తారు?, ఎంతవరకు కొలుస్తారు? అనేదే.
అలాగే ఇప్పటికే రవాణా శాఖ ఇప్పటికే కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని “Make Travel Family Friendly Again” అనే ప్రచారం చేపట్టింది. విమానాశ్రయాల్లో పిల్లల కోసం ప్లే ఏరియాలు, నర్సింగ్ రూమ్‌లు వంటి సదుపాయాలను పెంచాలని కోరుతోంది.
భారత్ లోనూ ఇలాంటి పరిస్ధితులు రాబోతున్నాయా?
భారత్‌లో కూడా జనాభా కథ ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాల్లో జననాల రేటు వేగంగా తగ్గుతోంది. కొన్ని ప్రాంతాల్లో యువ జనాభా ఎక్కువగా ఉంది. ఉద్యోగాల కోసం ప్రజలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాలకు వెళ్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఇక్కడ ప్రభుత్వాలు ఇలా ఆలోచించడం మొదలుపెడితే? “ఎక్కడ జనాభా పెరుగుతుందో అక్కడే ఎక్కువ మౌలిక వసతులు.” అని.
అయితే అప్పుడు ఓ కీలకమైన సందేహం మన ముందు ఉంటుంది. జనాభా పెరిగిన తర్వాత ప్రభుత్వం మౌలిక వసతులు నిర్మిస్తుందా? లేక మౌలిక వసతులు నిర్మించి అక్కడ జనాభా పెరిగేలా చేస్తుందా? ఇవేమీ కాక జనాభా పెరుగుతారని అంచనాలు, లెక్కలు వేసి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుందా
ఏదైమైనా..
ఇకపై మెట్రో మ్యాప్‌లో కొత్త లైన్ గీయడానికి ముందు, జనాభా మ్యాప్‌లో ఎక్కడ పిల్లలు పుడుతున్నారో చూడాలనుకుంటోంది ప్రభుత్వం. రైలు ఎక్కడికి వెళ్తుందో నిర్ణయించే ముందు…భవిష్యత్తు ఎక్కడ మొదలు కాబోతోందో తెలుసుకోవాలనుకుంటోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








