శివరాజ్‌కుమార్ కు తృటిలో తప్పిన ప్రమాదం
శివరాజ్‌కుమార్(Sivaraj kumar)కు తృటిలో ప్రమాదం తప్పింది. బెయిల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రదుర్గలోని ఓ ప్రైవేట్ షోరూమ్‌కు వెళ్లిన ఆయనకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో అక్కడ సందడి నెలకొంది. అయితే హీరో షోరూమ్‌లోకి ప్రవేశిస్తున్న టైమ్ లో అనుకోకుండా ఓ ఫైర్‌క్రాకర్ ఒక్కసారిగా పేలడంతో పరిస్థితి క్షణాల్లో ఉద్రిక్తంగా మారింది.
షోరూమ్ ప్రవేశ ద్వారం సమీపంలోనే పేలుడు సంభవించడంతో భారీ శబ్దంతో పాటు పొగ వ్యాపించింది. దీంతో అక్కడున్న ఫ్యాన్స్, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే శివరాజ్‌కుమార్‌ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో ఆయన యథావిధిగా మీడియాతో మాట్లాడి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
అభిమానులు తమ అభిమాన నటుడికి ఘన స్వాగతం ఇవ్వాలనే ఉత్సాహంతో చేసిన వేడుకే ఇలా అనుకోని ప్రమాదానికి కారణమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానుల అత్యుత్సాహం, సెలబ్రిటీ ఈవెంట్లలో భద్రతా చర్యలపై చర్చ మొదలైంది.








